మేమేం దేవుళ్లమా..?: సుప్రీంకోర్టు

23 Sep, 2017 02:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘మేమేం దేవుళ్లం కాదు.. దేవుడు మాత్రమే చేయగలిగే పనులను మమ్మల్ని చేయమని అడగొద్దు’ అని శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో దోమలను నిర్మూలించే దిశగా ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘మీ ఇంట్లో దోమ ఉంది.. ఈగ ఉంది.. వాటిని నిర్మూలించండి అని దేశంలోని ప్రతీ ఇంటికి వెళ్లి మేం చెప్పలేం.

అధికారులకు కూడా ఇలాంటి ఆదేశాలను మేమే కాదు ఏ కోర్టు కూడా ఇవ్వలేదు’ అంటూ వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కూడా ఒక పద్ధతి ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. 2015లో కూడా ఇలాంటి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిందని, అయితే, ఆ తరువాత డెంగీ ఇతర దోమల వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించిందని పిటిషన్‌దారు ధర్మాసనానికి గుర్తు చేశారు.

నిర్భయ నిధి’ నిర్వహణపై సుప్రీం అసంతృప్తి
లైంగిక దాడి బాధితులకు నిర్భయ నిధి కింద అందజేయాల్సిన పరిహారం విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిహారం ఎలా పంపిణీ చేయాలి, ఏ దశలో పంపిణీ చేయాలనే దానిపై స్పష్టత లేదని పేర్కొంది. బాధితులకు పరిహారం అందజేసేందుకు కేటాయించిన నిధుల నిర్వహణ, పంపిణీకి ఏకీకృత వ్యవస్థ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిర్భయ నిధిని కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ, మహిళా శిశు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ మూడు శాఖల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. ఏం చేయాలనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు’ అని  న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

గోరక్షకుల’ ఆగడాల నిరోధంపై...  
దేశంలో గోరక్షకుల ఆగడాలను అరికట్టడానికి రూపొందించిన విధివిధానాలపై తమ నివేదికల్ని అక్టోబర్‌ 13లోగా సమర్పించాలని 22 రాష్ట్రాలను సుప్రీం శుక్రవారం ఆదేశించింది. రాష్ట్రాలన్నీ కార్యచరణ నివేదికల్ని సమర్పించాల్సిందేనని, ఏ ఒక్కరూ కూడా తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు