2021 దాకా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు..

7 Jul, 2020 10:03 IST|Sakshi

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని.. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అదే విధంగా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలి రెండు దశల్లో ప్రాథమిక పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని.. వ్యాక్సిన్‌ పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షించే మూడో దశే అత్యంత కీలకం, కఠినమైనదని పేర్కొన్నారు. ప్రస్తుతం యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్‌ మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌-3లో ఉందని తెలిపారు. ‘‘ఏయే వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి, వాటి అభివృద్ధి తీరును డబ్ల్యూహెచ్‌ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.(కరోనా వ్యాక్సిన్‌ : ప్రకటనలో గందరగోళం)  

‘‘ఇప్పటివరకు కోవిడ్‌​-19కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానందున పేషెంట్ల చికిత్సకు రెమెడిసివిర్‌ వంటి మందులు ఉపయోగిస్తున్నారు. అయితే అది పూర్తిస్థాయిలో మరణాలను కట్టడి చేస్తుందనే విషయంపై ఎలాంటి స్పష్టతా లేదు. అలాగే ఫావిపిరవిర్‌ కూడా అంతే. నిజానికి దానిని అమితంగా ఉపయోగించడం వల్ల టెరాజెనిక్‌(జనన లోపాలు) తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి’’ అని పేర్కొన్నారు. ఇక కరోనా మరణాలపై అన్ని దేశాలు కచ్చితమైన లెక్కలు చెబుతున్నాయా లేదా అన్న విషయం బయటపడటానికి మరికొంతకాలం వేచి చూడక తప్పదని అభిప్రాయపడ్డారు. ఇక ఆగష్టు 15 నాటి భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటన గురించి మాట్లాడుతూ.. ట్రయల్స్‌ నిర్వహించడానికి చాలా సమయం పడుతుందని, అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

కాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఐసీఎంఆర్‌ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు ఐసీఎంఆర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని​ వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది. (భారత్‌: 20 వేలు దాటిన కరోనా మరణాలు)

మరిన్ని వార్తలు