అపర కుబేరుడు...అయినా ఐఫోన్‌ వాడరు!

10 May, 2017 07:43 IST|Sakshi
అపర కుబేరుడు...అయినా ఐఫోన్‌ వాడరు!
  • స్మార్ట్‌ ఫోన్‌ కూడా లేదు...
  • ఈ-మెయిల్‌కూ దూరం!!

  • కొత్తొక వింత పాతొక రోత అనేది సామెత! ముఖ్యంగా నేటి మార్కెట్‌ ట్రెండ్‌ ఇదే సూత్రం ఆధారంగా సాగుతోంది. కొత్తగా ఏది వచ్చినా అది ముందు మన చేతుల్లో ఉండాలనే తహతహ ప్రపంచమంతటా కనిపిస్తుంది. మొబైల్‌ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. స్మార్ట్‌ ఫోన్లలో ఆర్నెల్లకే కొంగ్రొత్త మోడళ్లు. అప్‌డేటెడ్‌ వెర్షన్లు ముంచెత్తుతుంటాయి. ఆ ప్రకారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండటం నేటి ఫ్యాషన్‌. ఇక ఐఫోన్‌ మీద క్రేజ్‌ గురించి వేరే చెప్పనవసరం లేదు. కొత్త వెర్షన్‌ కోసం నెలల తరబడి వేచివుంటూ.. ఏడాది కిందటే కొన్న ఐఫోన్‌ను పక్కోళ్లకి ఇచ్చేసో...లేక పక్కన పడేసో కొత్తదానికి సొంతం చేసుకునే వాళ్లు ఉన్నారు.

    వయసు 86 సంవత్సరాలు. అపర కుబేరుడు. ప్రపంచ ధనికుల్లో ఆయనది రెండో స్థానం. యాపిల్‌ కంపెనీలో ఆయనకు చాలా వాటాలున్నాయి. ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ ఆయన ఐఫోన్‌ వాడరు. ఆ మాటకొస్తే కనీసం స్మార్ట్‌ ఫోన్‌ కూడా వాడరు. పాతకాలం నాటి నోకియా ఫోన్‌నే వాడుతున్నారు. ‘ఏ వస్తువునైనా కనీసం ఓ పాతికేళ‍్లయినా వాడనిదే పారేయను’ అని స్పష్టంగా చెప్తారు. ఆయన ఈ-మెయిల్‌ కూడా వాడరు. ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఈ-మెయిల్‌ పంపించారు. ఆయనే వారెన్‌ బఫెట్‌!

    బఫెట్‌ తన జీవితాన్ని ఆరంభించినప్పుడు ఎలా బతికేవాడో ఇప్పుడూ దాదాపు అలాగే బతుకుతున్నారు. 1958లో ఓమాహాలో 31,500 డాలర్లకు కొన్న మూడు పడక గదుల ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. ఆయనకు సొంతంగా ఒక జెట్‌ విమానం ఉంది. కానీ అత్యవసర సమావేశాలు ఉంటేనే అరుదుగా దానిని వాడతారు. స్మార్ట్‌ ఫోన్లు, ఈ-మెయిళ్లు వాడరు కాబట్టి, బఫెట్‌కు కొత్త సాంకేతిక పరిజ్ఞానమంటే అనవసర భయమని చాలామంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. బఫెట్‌ తన జీవితాన్ని తన జీవిత సూత్రాల ప్రకారం జీవించే ప్రాక్టికల్‌ మనిషి. మనం అనుకునే ట్రెండ్‌ల ప్రభావానికి దేనికీ లోనుకాకుండా నిఖార్సైన జీవితం గడుపుతున్నారు. ముఖ్యంగా వస్తువుల విషయంలో అవసరాల ప్రాతిపదికన నడుచుకుంటారు. ‘ఏదైనా కంపెనీలో షేరు కొనాలంటే... దానిని కనీసం పదేళ్లయినా అట్టిపెట్టుకునే ఆలోచన లేకపోతే కొనవద్దు’ అనే మార్కెట్‌ జ్ఞానం ఆధారంగా ఆయన వస్తువులను చాలాకాలం పాటు వాడుతుంటారు.

    2014 వరకూ ఎనిమిది సంవత్సరాల పాతదైన క్యాడిలాక్‌ కారునే వాడారు. ‘నేను ఏడాదిలో సుమారు 3,500 మైళ్లు మాత్రమే కారులో ప్రయాణిస్తాను. కాబట్టి కొత్త కారు కొనడం అరుదు’ అని బఫెట్‌ వివరిస్తారు. ఎంతోకాలంగా వాడుతున్న తన నోకియా ఫ్లిప్‌ ఫోన్‌ను గర్వంగా చూపిస్తూ ‘దీనిని అలగ్జాండర్‌ గ్రహంబెల్‌ నాకు ఇచ్చారు’ అని తెలిపారు. ‘క్రెడిట్‌ కార్డులకు దూరంగా ఉండండి... మీ మీద మీరు పెట్టుబడులు పెట్టుకోండి’ అనేది ఆయన యువతకు ఇచ్చే ముఖ్యమైన సలహా. బఫెట్‌ సాధారణ జీవనశైలి వెనుక - ‘డబ్బు మనిషిని సృష్టించదు... డబ్బును సృస్టించిందే మనిషి’ అనే ఆయన సిద్ధాంతం బలంగా పని చేస్తుంటుంది.

    సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు