Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్‌లపై నిషేధం!

27 Oct, 2023 11:07 IST|Sakshi

ప్రపంచ నంబర్‌వన్‌ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్‌కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది.

కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్‌ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్‌ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్‌ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

(ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?)

యాపిల్‌ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్‌ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది.

యాపిల్‌ గత నెలలో వాచ్‌సిరీస్‌ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది.

మరిన్ని వార్తలు