మహిళకు చేదు అనుభవం; ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు

14 Mar, 2019 20:34 IST|Sakshi

బ్రిటన్‌కు చెందిన థామస్‌ కుక్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలనుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వస్త్రధారణపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్‌ స్టాఫ్‌.. డ్రెస్‌ మార్చుకోకపోతే విమానం నుంచి దింపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు సదరు మహిళ కజిన్‌ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే తాను ఎదుర్కొన్న అనుభవం గురించి ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. థామస్‌ కుక్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు చెప్పింది.

అసలేం జరిగిందంటే...
ఎమిలీ ఓ కన్నార్‌ అనే మహిళ మార్చి 2న బర్మింగ్‌హామ్‌ నుంచి కెనరీ ఐలాండ్స్‌కు వెళ్లేందుకు థామస్‌ కుక్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కింది. అయితే పై ఆమె ధరించిన డ్రెస్‌పై... స్టాఫ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయర్‌ నెక్‌ ఉన్న క్రాప్‌టాప్‌పై జాకెట్‌ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని లేదంటే లగేజ్‌తో సహా విమానం దిగాలని పేర్కొన్నారు. అయితే అందుకు ఎమిలీ నిరాకరించడంతో బలవంతంగా విమానం దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో తన డ్రెస్‌ కారణంగా ఎవరికైనా ఇబ్బందిగా ఉందా అంటూ ఎమిలీ అడగటంతో.. ఓ వ్యక్తి.. ‘నోరు మూసుకుని వాళ్లు చెప్పింది చెయ్యి’ అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె కజిన్‌ జోక్యం చేసుకుని తన జాకెట్‌ను ఎమిలీకి ఇవ్వడంతో సీట్లో కూర్చుకునేందుకు ఆమెకు అనుమతినిచ్చారు.

కాగా తనకు ఎదురైన అనుభవం గురించి ట్విటర్‌లో రాసుకొచ్చిన ఎమిలీ.. ‘చాలా దారుణంగా వ్యవహరించారు. నా జీవితంలో అత్యంత చెత్త ఘటన ఇది’ అని పేర్కొంది. ‘నన్ను అన్నారు సరే మరి నా వెనుకాల ఉన్న ఓ వ్యక్తి కేవలం షార్ట్‌ మాత్రమే ధరించి అసభ్యంగా ప్రవరిస్తున్నా అతడిని ఎవరూ ఏమీ అనలేదు’ అని వాపోయింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ‘ కన్నార్‌ను క్షమాపణ కోరుతున్నాం. మేము అందరినీ సమానంగా చూస్తాం. లింగ వివక్షకు మా ఎయిర్‌లైన్స్‌లో ఎంతమాత్రం తావులేదు’ అంటూ థామస్‌ కుక్‌ ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా తమ డైరెక్టర్‌ ఎమిలీని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పినట్లు పేర్కొంది. అయితే మనోభావాలను దెబ్బతీసే నినాదాలు, ఫొటోలు కలిగి ఉన్న దుస్తులు ధరిస్తే మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు