యువతి కంటి చూపు పోగొట్టిన ‘ఆన్‌లైన్‌’ వంట

16 Aug, 2019 14:40 IST|Sakshi

లండన్‌ : మెక్రోవేవ్‌లో ఉడకబెట్టిన కోడిగుడ్డు ఓ యువతి జీవితంలో విషాదాన్ని నింపింది. బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేయటానికి ఆన్‌లైన్‌ చిట్కాను ఉపయోగించి కంటి చూపును కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని రెడ్డిచ్‌కు చెందిన బెతానీ రోసర్‌(22) ఓ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేయటానికి కోడిగుడ్లు ఉడకబెట్టాలనుకుంది. అప్పుడు ఆమెకు ‘మెక్రోవేవ్‌లో గుడ్లు ఉడకబెట్టటం ప్రమాదం కాదు. సురక్షితంగా, వేగంగా గుడ్లను ఉడకబెట్టుకోవచ్చు’ అని ఇంటర్‌నెట్‌లో చదివిన సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే ఓ బౌల్‌లో నీళ్లు తీసుకుని గుడ్లు వేసి, అందులో కొద్దిగా ఉప్పు కూడా కలిపింది. ఆ గుడ్ల బౌల్‌ను మెక్రోవేవ్‌లో ఆరు నిమిషాల పాటు 900 వాట్స్‌ వద్ద ఉడికించింది. అనంతరం వాటిని బయటకు తీసి కొద్దిసేపు చల్లారబెట్టి.. అవి ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఓ గుడ్డును నొక్కి చూసింది. అంతే అది ఒక్కసారిగా పేలి ఆమె కుడివైపు ముఖంపై పడింది.

వేడివేడి ముక్కలు బలంగా ఆమె కుడి కంటిని ఢీ కొన్నాయి. దీంతో ఆమె కన్ను దెబ్బతిని, కంటిచూపును కోల్పోయింది. ముఖం కూడా బాగా కాలటంతో నొప్పి భరించలేక ఆమె దగ్గరలోని ఆసుపత్రికి పరిగెత్తింది. చికిత్స అనంతరం బెతానీ మాట్లాడుతూ.. ‘మెక్రోవేవ్‌ నుంచి గుడ్లను బయటకు తీసిన తర్వాత అవి ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఒకదాన్ని గట్టిగా నొక్కి చూశాను. అంతే అది పేలి నా ముఖంపై పడింది. నా జీవితంలో నేనెప్పుడు అంత భయపడలేదు. శరీరం వణుకుతూ ఉంది. నొప్పి భరించలేక ఏడుస్తూ ఉన్నాను. ఇంటర్‌నెట్‌లో చదివే విషయాలను గుడ్డిగా నమ్మవద్దు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికి నా కంటిచూపు మెరుగవలేదు. అసలు కంటిచూపు వస్తుందన్న నమ్మకం నాకు లేదని వాపోయింది.

మరిన్ని వార్తలు