బోసిపోయిన మేడారం

5 Feb, 2018 12:00 IST|Sakshi
మేడారంలో ఖాళీగా ఉన్న క్యూలైన్లు

బోసిపోతున్న జాతర ప్రాంగణం

నిర్మానుష్యంగా మారిన జంపన్న వాగు 

ఆదివాసీ మ్యూజియం మూసివేత

ఇంటి దారి పట్టిన వ్యాపారులు

మహా నగరంగా మారిన మేడారం ఖాళీ అవుతోంది. ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ శనివారం వన ప్రవేశం చేడయంతో జాతర వచ్చిన భక్తులు, వ్యాపారస్తులు ఇంటి దారి పట్టారు. దీంతో ఆదివారం జాతర ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. నిన్నమొన్నటి వరకు భక్తులతో కిటకిటలాడిన జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. ట్రాఫిక్‌ రోదనలు, భక్తుల కోలాహలం కనిపించిన మేడారం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది.     

ఏటూరునాగారం: ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అశేష భక్తజనం తరలివచ్చారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన మహా జాతర శనివారం దేవతల వనప్రవేశంతో ముగిసింది. భక్తులంతా వచ్చిన దారికి తిరుగు పయనమయ్యారు. జనవరి 12 నుంచి ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు జాతరకు వచ్చి భక్తులకు తన వస్తువులను అమ్ముకుని వ్యాపారాన్ని సాగించుకున్నారు. ఆశించిన మేర వ్యాపారం సాగకపోవడంతో మిగిలిన సామానును వెనుకకు పట్టుకుపోలేక రూ. 50, వంద రూపాలయ విక్రయించడం మొదలు పెట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వీరికి బొమ్మలు, ఇతర వస్తువులను అగ్గువకు విక్రయించడం గమనార్హం. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చాయని, లాభాలు రాలేదని వాపోయారు. మిగిలిన సామానును తీసుకెళ్లే ట్రాస్టుపోర్ట్‌ భారం మీద పడుతుందని, ఇక్కడే తక్కువకు విక్రయిస్తున్నట్లు అన్నం కృష్ణ అనే వ్యాపారి తెలిపారు. కొంత మంది వ్యాపారులు వారి సామగ్రిని సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టారు. మేడారం జాతరలోని షాపులన్ని దాదాపుగా ఖాళీ కావడంతో అంతా బోసిపోయి కనిపిస్తోంది. మళ్లీ రెండేళ్లకు వస్తా.. తల్లీ సల్లంగా చూడు.. అని వ్యాపారులు వారివారి సొంత గ్రామాల దారిపట్టారు. దీంతో మేడారం అంతా ప్యాకప్‌ అయ్యింది. 

మ్యూజియం మూసివేత...
మేడారం వచ్చే పర్యాటక భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆదివాసీ మ్యూజియాన్ని మూసివేశారు. మేడారం జాతర సందర్భంగా హడావుడి చేసి ప్రారంభించిన మ్యూజియానికి ఎవరు రావడం లేదనే సాకుతో మూసివేయడం బాధాకరం. సెలవు దినాలు, ఇతర సమయాలో కూడా మ్యూజియాన్ని ప్రదర్శనకు ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మేడారం వచ్చే వారికి దేవతలను దర్శించుకోవడమే కాకుండా ఇలాంటి పూర్వపు కాలపు చరిత్రలను తెలిపే మ్యూజియం పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.

పేరుకుపోయిన ఖాళీ సీసాలు
జాతరకు వచ్చిన భక్తులు తాగి పడేసిన బీరు సీసాలు, వాటర్‌ బాటిళ్లను ప్రతి ఒక్కటిని సేకరించే పనిలో పడ్డారు కొంత మంది పాతసామాను సేకరించే వ్యాపారులు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వేలాది బాటిళ్లు కుప్పలు తెప్పలు పేరుకుపోయాయి. వాటిని కొంత మంది పాతసామాను వ్యాపారులు పోగు చేసి రిసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే బస్తాల్లో నింపి బాటిళ్లు సుమారు పది లారీల, ఇతర వాహనాల్లో వరకు తరలించుకుపోయారు.  

మరిన్ని వార్తలు