గద్దె వద్ద తొక్కిసలాట

2 Feb, 2018 12:18 IST|Sakshi
సమ్మక్క గద్దె వద్ద తోపులాట దృశ్యం

ఏటూరునాగారం: గద్దెపైన సమ్మక్కను ప్రతిష్ఠించిన తర్వాత మొదటి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు గద్దెలపైకి ఎగబాకారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు కింద పడి పోలీసుల కాళ్లను పట్టుకుని పైకి లేచే ప్రయత్నిం చేశారు. ఈ క్రమంలో పలువురు భక్తులు తమ సెల్‌ఫోన్లు, పర్సులు పోగొట్టుకున్నారు. పోలీసుల ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని కొందరు గాయపడ్డారు. 

సమ్మక్కకు మొక్కుల పరవళ్లు 

మేడారం: వనదేవత సమ్మక్కకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమక్కను మేడారంలోని గద్దెకు తీసుకొచ్చే ఆపూర్వ ఘట్టంలో ఆదివాసీ, గిరిజన సంస్కృతి అడుగడుగునా ప్రతిబింబించింది. అడవితల్లి సమ్మక్కను స్మరించుకుంటూ చిలకలగుట్ట నుంచి గద్దె వరకు భక్తులు నీళ్లతో అలికి వివిధ రకాలు ముగ్గుల వేసి తరించారు. రోడ్డుపై కోళ్లు, గొర్రెలు, మేకలు బలిచ్చి కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మను మనసారా వేడుకున్నారు. కొందరు ముగ్గులపై పూలు వేసి, నిమ్మకాయలు పెట్టి పసుపు, కుంకుమ రుద్దీ కొబ్బరికాయలు కొట్టి అక్కడే మొక్కులు చెల్లించారు. మరికొంత మంది ఆనందంతో బాణాసంచి కాల్చి సమ్మక్కకు స్వాగతం పలికారు.

చెట్లు, బస్సులు ఎక్కి..
చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్కను తీసుకొచ్చే అపురూప క్షణాలను కనులారా వీక్షించేందుకు భక్తులు వివిధ మార్గాలను ఆశ్రయించారు. రోడ్డు పక్కన ఉన్న పెద్దపెద్ద చెట్లను, రోడ్డు పక్కన నిలిచిన బస్సులను ఎక్కి జై సమ్మక్క.. జై జై సమ్మక్క అంటూ నినాదాలు చేశారు. భక్తుల ఈలలు, కేరింతలతో చిలకలగుట్ట నుంచి మేడారం మార్గమంతా మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు శివసత్తులు రోడ్డుపైన డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. మహిళలు పూనకంతో ఊగిపోయి సమ్మక్కను స్మరించారు. తల్లీ.. చల్లంగా చూడు అంటూ వేడుకున్నారు.
   

మరిన్ని వార్తలు