‘చెప్పు’ కొనలేని బాధ

2 Jan, 2018 03:35 IST|Sakshi
కాలినడకన బడికి వెళ్తున్న కన్నాపూర్‌ తండా విద్యార్థులు

సర్కారు బడుల్లో సగం మందికి చెప్పుల్లేవు 

సాక్షి, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలకు వచ్చేది పేదవిద్యార్థులే. తల్లిదండ్రులు కూలీనాలీ చేస్తూ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం, యూనిఫాం.. పుస్తకాలు సరఫరా చేస్తున్న ప్రభు త్వం కాళ్లకు చెప్పులు లేవన్న విషయాన్ని గుర్తించడంలేదు. రాష్ట్రంలో 25,991 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుండగా.. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు వాటిలో చదువుతున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువమంది విద్యార్థులు చెప్పుల్లేకుండానే బడికి వెళ్తున్నారని విశ్రాంత డైట్‌ అధ్యాపకుడొకరు ‘సాక్షి’ తో ఆవేదన వ్యక్తం చేశారు.  

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 187 మంది విద్యార్థులున్నారు. అందులో 44 మంది విద్యార్థులకు చెప్పుల్లేవు. ఇదే జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ తండాకు చెందిన విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండానే నిత్యం కన్నాపూర్‌ యూపీఎస్‌కు కాలినడకన వెళుతున్నారు. జుక్కల్‌ మండలం చిన్న ఎడ్గి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులు బడికి రాగా.. వారిలో నలుగురికి మాత్రమే చెప్పులున్నాయి. 

మరిన్ని వార్తలు