అద్దెలపై బల్దియా దృష్టి 

7 Mar, 2019 12:09 IST|Sakshi

‍సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఏళ్ల తరబడిగా ఖాళీగానే ఉంటున్న షట్లర్లను అద్దెలకు ఇచ్చేందుకు బల్దియా నడుం బిగించింది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఉన్న వనరులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షట్టర్లను అద్దెలకు ఇచ్చేందుకు వేలం పాటకు సిద్ధపడుతున్నారు. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఐడీఎస్‌ఎంటీ నిధులతో నిర్మించిన నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో కూడా షట్టర్లను అద్దెలకు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అద్దెల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్నాళ్లు వేలం పాటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

గతంలో ఒకటి రెండు సార్లు దుకాణాలకు వేలం పాట వేస్తున్నామని హడావిడి చేసినప్పటికీ వేలం వేయకుండానే చేతులు దులుపుకున్నారు. మున్సిపల్‌ ఆవరణలో ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌లో దాదాపు నాలుగేళ్లుగా పైఅంతస్తులో 14 గదులు ఖాళీగా ఉంటున్నాయంటే అధికారులు ఏమేరకు శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోంది. మున్సిపల్‌ పాత గెస్ట్‌హౌస్‌ స్థలంలో ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులు రూ.3.5కోట్లతో 42 షెట్టర్లను నిర్మించారు. అద్దెలకు ఇస్తే వాటిపై కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే కాంప్లెక్స్‌ సెల్లార్‌లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. గతంలో వేలం నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎవరూ అద్దెలకు రాలేదు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాగైనా అద్దెలకు ఇవ్వాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు.


అక్రమాలకు పాల్పడితే చర్యలు
నగరపాలక సంస్థ ఆవరణలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాలను  కొంత మంది అద్దెలకు తీసుకుని ఇతరులకు ఎక్కువ కిరాయికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి వారిపై ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా ఉండి, అద్దె అగ్రిమెంట్‌ గడువు ముగియడంతోనే వారిని ఖాళీ చేయించేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. అద్దెలకు తీసుకున్న వారు తప్ప ఇతరులు ఎవరైనా ఆ దుకాణాల్లో వ్యాపారం నిర్వహిస్తే మున్సిపల్‌ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

అద్దెలపై దృష్టి సారించాం
మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షెట్టర్లతోపాటు ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులతో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లోనూ షెట్లర్లు అద్దెకు ఇచ్చేందుకు దృష్టిసారించాం. ప్రస్తుతం అద్దెలకు తీసుకున్న షెట్టర్లలో ఇతరులు వ్యాపారం చేస్తే ఖాళీ చేయిస్తాం. అదనపు అద్దెల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి గడువు ముగిశాక ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం.
– సత్యనారాయణ, కమిషనర్‌  

మరిన్ని వార్తలు