‘కల్యాణలక్ష్మి’కి మళ్లీ బ్రేక్‌!

15 Mar, 2019 14:25 IST|Sakshi
కల్యాణలక్ష్మి

సాక్షి, ఆత్మకూర్‌ (ఎస్‌) : పేద, మధ్యతరగతి ఇళ్లలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని.. వారి పెళ్లి ఖర్చులకు ఆర్థికసాయం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి మళ్లీ బ్రేక్‌ పడింది. ఈ పథకాన్ని మొదట్లో ఎస్సీ, ఎస్టీల కోసమే ప్రవేశపెట్టి రూ.51 వేలు ఇవ్వగా.. తదనంతరం అన్ని వర్గాల్లోని పేదలకు వర్తింజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థికసాయాన్ని ప్రభుత్వం రూ.లక్షకు పెంచింది. అయితే ఏడాదిగా వివిధ కారణాలతో కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

463 దరఖాస్తులకు 325మందికి చెక్కుల మంజూరు..
కల్యాణలక్ష్మి పథకానికి మండల వ్యాప్తంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు 463మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఈబీసీలు 250మంది, ఎస్టీలు 90, ఎస్సీలు 110, ముస్లింలు 13మంది తమ దరఖాస్తులను మండల అధికారులకు సమర్పించారు. వీటిల్లో ఇప్పటివరకు కేవలం 325మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ నిధులను మంజూరు చేసింది. మిగిలిన 138 దరఖాస్తులు వివిధ దశల్లో అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నిధులు మంజూరైన 325 లబ్ధిదారుల్లోనూ అతికొద్ది మందికే చెక్కులను అందగా.. మిగతా వారికి మంజూరైన నిధులు ట్రైజరీ కార్యాలయాల్లోనే ఉన్నాయి.

అమలులోకి ఎంపీ ఎన్నికల కోడ్‌ ..
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పరిశీలనలు పూర్తయి.. నిధులు విడుదలయ్యే సమయానికి ఎన్నికల కోడ్‌ రావడం.. మూడు నెలలపాటు ఎన్నికల వాతావారణమే ఉండడంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండి పంపిణీ ఆలస్యమైంది. దీనికి తోడుగా ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించడంతో కోడ్‌ అమల్లోకి వచ్చి కల్యాణలక్ష్మికి మళ్లీకి బ్రేక్‌లు పడినట్లయింది. దీంతో ఏడాదిగా అప్పులు చేసి పెళ్లి చేసిన కుటుంబాలు కల్యాణలక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నాయి.  

మరిన్ని వార్తలు