క్యాన్సర్‌.... ఇదిగో ఆన్సర్‌..

31 Jan, 2018 11:20 IST|Sakshi
క్యాన్సర్‌ రోగికి వ్యాధిని నయం చేసేందుకు రేడియేషన్‌ ఇస్తున్న దృశ్యం

ఒకే ఒక్క టీకాతో సర్వైకల్‌ క్యాన్సర్‌కు చెక్‌

ఆడపిల్లలకు వ్యాక్సిన్‌ వేయించడం ద్వారా రక్షణ   

జీజీహెచ్‌లో ఉచితంగా వైద్య పరీక్షలు

సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో వందలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకేఒక్క టీకాతో ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. జనవరి నెలను సర్వైకల్‌ క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవంగా ప్రకటించి అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.

గుంటూరు మెడికల్‌ : సర్వైకల్‌ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన లేకపోవడంతోనే అత్యధిశాతం మంది వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతి ఏడు నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతుంది. ఆడపిల్లలకు కేవలం ఒకే ఒక వ్యాక్సిన్‌ చేయించడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా  కాపాడవచ్చు. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్, సర్వైకల్‌ క్యాన్సర్లే ఎక్కువ. గుంటూరు  జీజీహెచ్‌లో ప్రతి ఏడాది 150 నుంచి 200 మంది వరకు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్వైకల్‌ చికిత్స పొందుతున్న వారి బాధితుల సంఖ్య 200 వరకు ఉంటుంది. దీనిని టీకాతో చెక్‌ పెట్టవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. జనవరినెలను సర్వైకల్‌ క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవంగా నిర్ణయించి వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

గర్భాశయముఖద్వారా క్యాన్సర్‌గా పిలువబడే సర్వైకల్‌ క్యాన్సర్‌ రావటానికి ‘ హ్యూమన్‌ ప్యాపిలోమా వైరస్‌ (హెచ్‌పివి) ఇన్‌ఫెక్షన్‌. విచ్చలవిడి శృంగారం, తక్కువ వయస్సులోనే శృంగారంలో పాల్గొనడం, సుఖవ్యాధులు ఉన్నవారితో శృంగారంలో పాల్గొనడం, శరీరంలో వ్యాధి నిరోధకశక్తి తగినంతగా లేకపోవడం తదితర కారణలతో ఈ క్యాన్సర్‌ వస్తుంది.

ప్రాథమిక లక్షణాలు
సర్వైకల్‌ క్యాన్సర్‌ సోకిన వారిలో నెలసరి కాలంలో కంటే  అధిక రక్తస్రావం కావడం, తెలుపు, మైల ఎక్కువగా కనిపించడం, పొత్తికడుపుకింద భాగంలో విపరీతమైన నొప్పి, మూత్రం పోసే సమయంలో నొప్పిరావడం తదితర లక్షణాలు వ్యాధి సోకిన సమయంలో కనిపిస్తాయి.

ప్యాప్‌స్మియర్‌తో గుర్తించవచ్చు
సర్వైకల్‌ క్యాన్సర్‌ను ప్యాప్‌ స్మియర్‌ అనే పరీక్ష ద్వారా గుర్తిస్తారు. వైద్య పరీక్షలో భాగంగా యోని వద్ద కొంత ద్రావకం తీసి స్లైడ్‌ ద్వారా పరీక్ష చేస్తారు. రెండు గంటల్లోనే వ్యాధి నిర్థారణ పరీక్ష పూర్తవుతుంది. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ, క్యాన్సర్‌పై సందేహాలు ఉన్నవారు ఈ పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమం. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఉచితంగా ప్యాప్‌స్మియర్‌ పరీక్షలు చేస్తున్నారు. జీజీహెచ్‌లో ప్రతి ఏడాది 150 నుంచి 200 మంది సర్వైకల్‌ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్నారు. వివిధ రకాల క్యాన్సర్లతో జీజీహెచ్‌కు ప్రతిఏడాది 1000 నుంచి 1200 మంది చికిత్స కోసం వస్తుండగా వీరిలో 40 శాతం సర్వైకల్‌ క్యాన్సర్‌లే.  ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే ఆపరేషన్‌ చేసి నయం చేయవచ్చు.– డాక్టర్‌ రాజునాయుడు, జీజీహెచ్‌ క్యాన్సర్‌ వైద్య విభాగాధిపతి

ఒక్క వ్యాక్సిన్‌తో వ్యాధికి చెక్‌ పెట్టవచ్చు
సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా ముందస్తుగా ఆడపిల్లలకు వ్యాక్సిన్‌ చేయించడం చాలా ఉత్తమం. పదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు వయస్సు ఉన్నప్పుడు ఆడపిల్లలకు వ్యాక్సిన్‌ వేయించడం ద్వారా సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రతినెలా 60 మందికిపైగా చికిత్స కోసం వస్తున్నారు. పాఠశాలల యాజమాన్యం చొరవ చూపించి తల్లిదండ్రులకు వ్యాధిపట్ల అవగాహన కల్పించి ఆడపిల్లలకు వ్యాక్సిన్‌లు చేయించేలా చూడాలి. ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సర్వైకల్‌ క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించి ఆడపిల్లలను వ్యాధి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించాలి. – డాక్టర్‌ కందుల రామ్,క్యాన్సర్‌ వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు