ఆమె మీద అసహ్యం లేదు.. ఇప్పటికీ తనంటే..

5 Dec, 2019 15:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను ఐదవ తరగతి చదువుతున్నపుడు మొదటిసారి తనని చూశాను. ఆ రోజు తను వేసుకున్న డ్రెస్‌ నాకిప్పటికీ గుర్తుంది. ఆమెను చూడగానే మనసు పారేసుకున్నా. తను తమిళనాడుకు చెందిన అమ్మాయి. ఆంధ్రలో ఉంటున్న వాళ్ల బంధువుల ఇంట్లో ఉండేది. తను మాతో కలిసి కూర్చునేది. తమిళనాడులోని వాళ్ల కుటుంబాన్ని ఎంత మిస్సవుతుందో చెప్పుకునేది. తను చాలా సున్నిత మనస్కురాలు. నాతో ఏడవ తరగతి వరకు చదువుకుంది. ఆ ఏజ్‌లో అది ప్రేమ అని చెప్పటానికి లేదు కానీ, తన మీద ఏదో మాటల్లో చెప్పలేని ఆరాధనా భావం. ఏడు తర్వాత మేము వేరుపడ్డాం. మా సెక్షన్లు వేరువేరు. పదవ తరగతి తర్వాత తనను చూడలేదు. చాలా రోజుల తర్వాత డిగ్రీలో తనను కలిశాను. ఏది ఏమైనా వేరే అమ్మాయి వంక నేను కన్నెత్తికూడా చూడలేదు. నాకంత ఆసక్తి కూడా ఉండేది కాదు.

తన రూపం నా గుండెల్లో ముద్రపడిపోయింది. నా ప్రేమను ఆఖరికి నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పుకోలేదు. వయస్సు పెరుగుతున్న కొద్ది తన మీద నాకున్న భావాలు ఇంకా గట్టిపడసాగాయి.  తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగోలేక జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. తను కనిపించదని తెలిసినా నేను వాళ్ల ఇంటి వైపు నుంచి నడుచుకుంటూ వెళ్లే వాడిని. ఓ రోజు నాకు ఓ తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ ఎత్తి మాట్లాడాను. తనే ఫోన్‌ చేసింది. షాక్‌ అయ్యాను. కళో! నిజమో! అర్థం కాలేదు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. తను నా నెంబర్‌ ఎలా కనుక్కుందో నాకు తెలియదు. నాకు నమ్మకం ఉండింది.

నిజమైన ప్రేమకు భగవంతుడు తప్పక దారి చూపిస్తాడని. డబ్బు సంపాదన కోసం నేను మలేషియా వెళ్లినప్పటికి ఫోన్‌లో టచ్‌లో ఉండేవాళ్లం. ఎన్నో ప్లాన్‌ వేసుకుని వెళ్లాను. కానీ, ఓ సంవత్సరం తర్వాత వెనక్కు వచ్చేశాను. దూరంగా ఉండేసరికి మా బంధం మరింత బలపడింది. నాకు మా ఇంట్లో, బంధువుల్లో, చుట్టుప్రక్కల అమాయకుడినని పేరుంది. అయితే తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలిసి పారిపోదామని అంది. మేము పారిపోయి పెళ్లి చేసుకున్నాం. దీంతో మా బంధువులు, ఫ్రెండ్స్‌ షాక్‌ అయ్యారు. కొద్దిరోజులకు వాళ్ల కుటుంబం మా పెళ్లిని అంగీకరించక తప్పలేదు. నేను చాలా సంతోషపడ్డాను.  పెళ్లి తర్వాత తన ఇష్టాలకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కొన్నిసార్లు మా తల్లిదండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా వెళ్లాను.

కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి తర్వాత వాళ్ల ఇంటికి వెళతానంది. నేను ఒప్పుకున్నాను. మూడు నెలలు గడిచిన తర్వాత ఓ రోజు వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్లు ఇంట్లోకి రానివ్వలేదు. మరుసటిరోజు విడాకులు పంపింది. నాకు ఆస్తి, అంతస్తులు లేని కారణంగా తను నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో నేను మళ్లీ దేశం విడిచిపెట్టివెళ్లిపోయాను. ఆ బాధనుంచి బయటపడలేకపోతున్నాను. కాలం మనసుకైన గాయాలను మాన్పుతుందని నా స్నేహితులు అన్నారు. కానీ, అలా జరగలేదు. నేనో పిచ్చోడిలా బ్రతుకుతున్నా. ప్రపంచం నానుంచి దూరం అయ్యింది. ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నా. నాకు ఆమె మీద అసహ్యం లేదు. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా.
 - ఇర్ఫాన్‌ రషీద్‌

​​​​​​

లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు