తమిళనాడులో బీజేపీకి భారీ షాక్‌

5 Dec, 2019 15:11 IST|Sakshi

చెన్నై : తమిళనాడులో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. డీఎంకేలో చేరారు. గురువారం డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంకు వెళ్లిన అరసకుమార్‌ ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తను డీఎంకేలో చేరుతున్నట్టు అరసకుమార్‌ ప్రకటించారు. అనంతరం అరసకుమార్‌ మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల తరువాత తిరిగి సొంతగూటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఎంకే కుటుంబ సభ్యునిగా నన్ను చేర్చుకున్నందుకు స్టాలిన్‌కు ధన్యవాదాలు. నేను స్టాలిన్‌ గురించి మాట్లాడినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకులు నన్ను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. కానీ నేను నిజమే మాట్లాడాను. ప్రపంచంలోని తమిళులకు స్టాలిన్‌ రక్షకుడిగా ఉంటారు. తమిళనాడు బీజేపీలోని కొందరు వ్యక్తులు నాపై కక్ష పెంచుకున్నారు. నేను ఈ రోజు పార్టీని వీడటంతో వారు సంతోషపడుతున్నారు. కానీ వారి సంతోషం కొంతకాలమే.. ఎందుకంటే రాబోయే కొన్ని నెలల్లో తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ ప్రజలు స్టాలిన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నార’ని తెలిపారు. 

కాగా, ఇటీవల ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అరసకుమార్‌.. స్టాలిన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. స్టాలిన్‌ను ఎంజీఆర్‌తో పోల్చడంతో పాటు.. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అయితే అరసకుమార్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అరసకుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ జనరల్‌ సెక్రటరీ కేఎస్‌ నరేంద్రన్‌ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు