ఆ మాట వినడానికా బ్రతికున్నది!

25 Dec, 2019 10:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాది కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామం. నా డిగ్రీ అయిపోయిన తరువాత నేను మా ఫ్రెండ్స్ గుంటూరుకి కోచింగ్ కోసం వెళ్లాము. అక్కడికి అమ్మాయిలు కూడా కోచింగ్‌కు వచ్చారు. నాకెందుకో చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటే కొంచెం భయం ఉండేది. అందుకే నేను అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. అలా కోచింగ్ తీసుకుంటున్న సమయంలో నన్ను ఒక అమ్మాయి చూసి ఇష్టపడింది. నా దగ్గరకి వచ్చి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది ఆ అమ్మాయి చాలా బాగుంది. నేను నమ్మలేదు! జోక్ చేస్తోందేమో అనుకున్నా. కానీ, ఆ అమ్మాయి నన్ను సిన్సియర్‌గా లవ్ చేస్తోందని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ నాకు చెప్పారు. తర్వాత నేను ఆ అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా 3నెలలు హ్యాపీగా ప్రేమించుకున్నాం. నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చి వెళ్లి పోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ అమ్మాయి అనుక్షణం గుర్తుకు వచ్చేది. నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు.

ఆ అమ్మాయికి కూడా నెల్లూరులో జాబ్ వచ్చి అక్కడికి వెళ్లిపోయింది. ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్లం. 2 నెలల తరువాత దసరా పండగ వచ్చింది. నేను మా ఇంటికి వెళ్లాను మా ఇంట్లో నా ప్రేమ విషయం చెప్పాను. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసి ‘పవన్ నేను దసరాకి మీ ఇంటికి వస్తాను. మీ అమ్మానాన్నని చూడాలి’ అని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో వాళ్లకి చెప్పిన తరువాత ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో 10రోజులు ఉంది. ఉన్నన్నాళ్లు అందరితో కలిసిపోయింది. తరువాత ఎవరి జాబ్ వాళ్లు చేసుకోవడం స్టార్ట్ చేశాం. నాకు ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా.. ఎప్పుడెప్పుడు తనతో లైఫ్ స్టార్ట్ చేయాలా అని చాలా కోరికలు ఉండేవి

ఈ విషయం తనతో చెప్పాను. తను కూడా ఒప్పుకుంది. తరువాత తను ‘మా ఇంట్లో చెబుతాను. మనం పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. తను వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాత. ఏమైందో ఏమో ‘నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంకా టైమ్ కావాలి’ అని అంది. నేను కూడా ఓకే చెప్పాను. కొన్ని రోజుల తరువాత ఏమైందో ఏమో నాకు ఫోన్ చేయడం తగ్గించింది. నేను ఫోన్ చేసినా కట్ చేసేది. నాకు చచ్చి పోవాలని అనిపించింది. సూసైడ్ అటెంప్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ నన్ను బ్రతికించారు. ఏం పని చేయలేక అలాగే బాధ పడుతూ ఉండే వాడిని. 3నెలల తరువాత ఆ అమ్మాయి దగ్గరినుంచి ఫోన్ వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. తను ఏడుస్తుంటే ఎందుకని అడిగాను. ‘నేను నిన్ను మిస్ అవుతున్నాను. నిన్ను చూడాలి’ అని చెప్పింది. అలా మళ్లీ మా ఇద్దరి మధ్యా ప్రేమ కథ మొదలైంది.

మళ్లీ కొన్ని రోజుల తరువాత ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని చెప్పింది. అప్పుడు నా గుండె పగిలింది. ‘ఆ మాట వినడానికా నేను ఇంకా బ్రతికి ఉన్నది’ అనిపించింది. ‘ఎందుకు’ అని అడిగాను. ‘మా ఇంట్లో వాళ్లకి మనం​ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు’ అని చెప్పింది. ఒకటి మాత్రం చెబుతాను! ప్రేమించేటప్పుడు గుర్తుకు రాని పేరెంట్స్ పెళ్లి విషయంలో ఎందుకు గుర్తుకు వస్తారో నాకు అర్థం కావడం లేదు. లైఫ్‌లో తనని వద్దు అనుకున్నా. తను ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలి. ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తే కష్టం అయిన సుఖం అయిన పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని చెప్పి, తరువాత వద్దు అని అనకండి. ఎందుకంటే ప్రతి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అని ప్రేమిస్తాడు. కానీ, ప్రేమించి మోసం చేస్తే ఆ బాధని తట్టుకోవడం చాలా కష్టం.
- పవన్‌,కడప


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు