ఊరిస్తూ...

2 Feb, 2018 19:33 IST|Sakshi

ఉసూరుమనిపించిన కేంద్ర సాధారణ బడ్జెట్‌

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌కు రూ.75 కోట్లు

కనిపించని రోడ్లు, రైలు మార్గాల ప్రస్తావన

వేతన జీవుల ఆశలపై నీళ్లు , జైట్లీ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

భారీ ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిరంగాలకు పెద్దపీట వేయడం కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. ఐఐటీకి నిధుల కేటాయింపు మినహా.. రైలు మార్గాలు, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రస్తావనేదీ కనిపించలేదు. పేదలకు ఉచిత వైద్యం, గ్యాస్‌ కనెక్షన్లు, గ్రామీణ జీవనోపాధి వంటి అంశాలపై సానుకూలత వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆదాయ పన్ను పరిమితి పెంచక పోవడంపై వేతన జీవుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి


ఆదాయ పన్ను పరిమితి శ్లాబులను సవరిస్తారని భావించిన వేతన జీవులు తీవ్ర నిరాశ చెందారు. పెన్షనర్లు, సీనియర్‌ సిటిజన్లకు కొన్ని రాయితీలు ఇవ్వడం ఊరటనిచ్చేదిగా ఉంది.

సూక్ష్మ, లఘు పరిశ్రమలకు ఊతం లభిస్తుందని అంచనా వేసినా, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఈపీఎఫ్‌ మినహా ఇతర అంశాలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.

మెదక్‌ : ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ హైదరాబాద్‌)కి రూ.75 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాధారణ బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఐఐటీ హైదరాబాద్‌ శాశ్వత క్యాంపస్‌కు 2008లో శంకుస్థాపన చేయగా, 2017 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది రూ.50 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.75 కోట్లు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎన్నికల బడ్జెట్‌గా అభివర్ణించిన కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలతో పాటు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు కేటాయించిన నిధులు వ్యవసాయ ప్రధానంగా ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.

మద్దతు ధర ప్రకటించని ఖరీఫ్‌ పంటలకు మద్దతు ధర ప్రకటించి, సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు అదనంగా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న, కంది వంటి పంటలకే మద్దతు ధర లభిస్తుండగా.. ఇతర పంటలు సాగు చేసే రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే ప్రకటనపై ఆసక్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగానికి రూ.11 లక్షల కోట్ల రుణాలు, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా రుణాలు వంటి అంశాలపై సంబంధిత వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ఏటా సుమారు రూ.5వేల కోట్ల మేర పంట రుణాలు ఇస్తుండగా, ప్రస్తుత ప్రకటనతో కౌలు రైతులకు ఊరట లభించనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ల సంఖ్యను పెంచడంతో పాటు ఇంటర్నెట్‌ ద్వారా అనుసంధానం చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా సంగారెడ్డిలో ఏడు, మెదక్‌లో ఐదు, సిద్దిపేటలో 14 వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. జాతీయ మార్కెటింగ్‌ వ్యవస్థ ‘ఈ–నామ్‌’తో జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, సిద్దిపేట మార్కెట్‌ యార్డులు ఇప్పటికే అనుసంధానమయ్యాయి. ప్రభుత్వ ప్రకటనతో మిగతా మార్కెట్‌ యార్డులు దశల వారీగా జాతీయ మార్కెటింగ్‌ వ్యవస్థతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది.

బడ్జెట్‌ కేటాయింపుల్లో జాతీయ ఉపాధి పథకాలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో నమోదైన వారికి లబ్ధి చేకూరనుంది. జిల్లాల వారీగా సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షలు, సిద్దిపేటలో 1.39లక్షలు, మెదక్‌లో 1.02లక్షల మంది ఈజీఎస్‌ జాబ్‌ కార్డులు కలిగిన వారు ఉన్నారు. ప్రస్తుత కేటాయింపులతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలు ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులు వేగవంతం కానున్నాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టే సామాజిక భద్రత పింఛన్లు, బ్యాంకు రుణాలు, జీవనోపాధి కార్యక్రమాలకు ఊతం లభించనుంది.

తెలుపు రంగు రేషన్‌ కార్డులు కలిగిన వారికి జాతీయ స్థాయిలో తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య పథకం కింద సంగారెడ్డిలో 3.33 లక్షలు, మెదక్‌లో 1.94లక్షలు, సిద్దిపేటలో 1.89 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. జాతీయ స్థాయి ఆరోగ్య పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందే అవకాశం ఉంది.

ప్రస్తుతం దీపం పథకం ద్వారా తెలుపు రంగు రేషన్‌ కార్డు కలిగిన వారి వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తుండగా, ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని తాజాగా ప్రతిపాదించారు. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో సుమారు రెండు లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని పౌర సరఫరా శాఖ వర్గాలు చెబుతున్నాయి.

స్వచ్ఛభారత్‌ మిషన్‌కు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించగా.. సిద్దిపేట, మెదక్‌ జిల్లాలను ఇప్పటికే సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో 45వేలకు పైగా మరుగుదొడ్లను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసి సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల మేరకు బాలికా విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలకు ఊతం లభించనుంది.

రోడ్లు, రైల్వే లైన్ల ప్రస్తావనేదీ?

కేంద్ర సాధారణ బడ్జెట్‌లో రైల్వే పద్దును కూడా చేర్చడంతో గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రతిపాదించిన రైలు మార్గాల కేటాయింపులపై స్పష్టత రావడం లేదు. మనోహరాబాద్‌–కొత్తపల్లి, అక్కన్నపేట–మెదక్‌ మార్గాల నిర్మాణం కొనసాగుతుండగా.. నిధుల కేటాయింపు కీలకంగా మారింది. బోధన్‌–బీదర్, పటాన్‌చెరు–ఆదిలాబాద్, జహీరాబాద్‌ డబ్లింగ్‌ వంటి పనులకు నిధుల కేటాయింపు ప్రస్తావన బడ్జెట్‌లో కనిపించలేదు. రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించినా.. సంగారెడ్డి–అకోలా (ఎన్‌హెచ్‌ 161), మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి, బోధన్‌–మెదక్‌–బాలానగర్‌ రహదారుల కేటాయింపులు వెల్లడి కావాల్సి ఉంది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌) ప్రస్తావన కూడా అరుణ్‌ జైట్లీ ప్రసంగంలో కనిపించలేదు.  
 

మరిన్ని వార్తలు