కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. హస్తానికి దామోదర రాజనర్సింహ గుడ్‌ బై!

7 Nov, 2023 11:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక, కాంగ్రెస్‌లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. దీంతో, తుది వరకు టికెట్‌ ఆశించి భంగపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ. ఇక, టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

అయితే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని  నారాయణఖేడ్, పటాన్ చెరులలో  సీట్ల కేటాయింపు విషయమై  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. అయితే, నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి  శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు  టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో  దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా  వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. 

మరోవైపు.. పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించడంపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు. కాగా, కాంగ్రెస్‌లో కొనసాగడంపై నేడో రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మండిపడుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఇక ఆపండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

మరిన్ని వార్తలు