జంధ్యాలకు గౌరవ డాక్టరేట్!

4 Nov, 2014 23:01 IST|Sakshi

రచయిత నుంచి దర్శకుడిగా ఎదిగి, సకుటుంబ వినోద చిత్రాలతో ఒక దశాబ్దిన్నర కాలం పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘన సినీ చరిత్ర - జంధ్యాలది. రచన, దర్శకత్వాల ద్వారా కొన్ని తరాలు చెప్పుకొనే కామెడీతో వెండితెరను వెలిగించిన ఆయనకు తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది. మరణించిన 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆయనకు గౌరవ డాక్టరేట్ లభించింది. అమెరికాకు చెందిన అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, యునెటైడ్ నేషన్ ఆర్గనైజేషన్‌కు అనుబంధమైన స్వస్త ఎన్విరాన్‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్‌లు ఈ నవంబర్ 1న బెంగళూరులో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. స్వర్గీయ జంధ్యాల తరఫున ఆయన సతీమణి అన్నపూర్ణ ఈ పత్రాన్ని స్వీకరించారు. మనిషి ఉండగానే అవసరం లేకపోతే మర్చిపోయే సినీ (మాయా) ప్రపంచంలో ఒక వ్యక్తి భౌతికంగా కనుమరుగైన ఇన్నేళ్ళకు ఇలాంటి గౌరవం దక్కడం  నిజంగా విశేషమే!