20 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా అన్నారు

17 Jul, 2016 23:48 IST|Sakshi
20 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా అన్నారు

‘‘ఈ తరం ప్రేక్షకులు కూడా మీరు ‘ఆదిత్య 369’ చిత్రనిర్మాత కదా అని గుర్తుపడుతున్నారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఆ చిత్రం గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటే.. గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఈ ఏడాది ‘జెంటిల్‌మన్’తో సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ కావడం నాకు డబుల్ ధమాకా’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఆదిత్య 369’ విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ పలు విశేషాలను పంచుకున్నారు....   
 
ఓ రోజు బాలు అంకుల్ (ఎస్పీ బాలసుబ్రమణ్యం) ఫోన్ చేసి ‘సింగీతం ఓ కథ చెప్పారు, బాగుంది. ఆ సినిమా చేస్తే, ఇండస్ట్రీలో నీకో మంచి స్థానం ఖాయం’ అని గొప్పగా చెప్పారు. వెంటనే సింగీతంగారిని కలిశాను. ‘‘హాలీవుడ్ మూవీ ‘బ్యాక్ టు ఫ్యూచర్’ ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కథ రాశానండీ’’ అని 45 నిమిషాల పాటు నేరేషన్ ఇచ్చారు. కథ చాలా కొత్తగా ఉంది. విపరీతంగా నచ్చేసింది  అప్పటి వరకూ ఎన్టీఆర్, ఏయన్నార్‌లు మాత్రమే శ్రీకృష్ణ దేవరాయులు పాత్ర పోషించారు.

ఈ కథకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని సింగీతమే సలహా ఇచ్చారు. దేవి ఫిలింస్ అధినేత దేవీ వరప్రసాద్ సహాయంతో బాలయ్యను కలసి కథ వినిపించాం. కొత్త నిర్మాత, ప్రయోగాత్మక సినిమా అని ఆలోచించకుండా.. కథ నమ్మి అంగీకరించారు. ఇళయరాజా సంగీతం, జంధ్యాల రచన, తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్.. ఇలా మంచి టీమ్ సెట్ అయ్యింది  మొదట ‘యుగపురుషుడు’ టైటిల్ అనుకున్నాం. అప్పటికి పదేళ్ల క్రితమే ఎన్టీఆర్‌గారు ఆ టైటిల్‌తో ఓ సినిమా చేశారు. నాన్నగారి టైటిల్ కంటే మరొకటి ఆలోచిస్తే బాగుంటుందని బాలయ్య కోరడంతో ‘ఆదిత్య 369’ పెట్టడం జరిగింది.  ఈ చిత్రానికి  పీసీ శ్రీరామ్, వియస్సార్ స్వామీ, కబీర్‌లాల్.. సినిమాటోగ్రాఫర్లు గా చేశారు. అప్పట్లో గ్రాఫిక్స్ లేవు కదా.

ఆప్టికల్ పద్ధతిలోనే చిత్రీకరించాం. టైమ్ మెషీన్ తయారీకి ఐదు లక్షలు, శ్రీకృష్ణదేవరాయులిగా బాలయ్య కాస్ట్యూమ్స్, నగలకు 10 లక్షలు ఖర్చయింది. అప్పట్లో రూ. 1.20 కోట్లతో సినిమా తీస్తే సేఫ్. ఈ సినిమా బడ్జెట్ కోటిన్నర దాటింది. అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు ఫ్లోర్లలో వేసిన సెట్స్ చూసి భారీ చిత్రమని అందరికీ అర్థమైంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎక్కువ రేటుకి కొన్నారు. నిర్మాతగా నాకూ, వాళ్లకీ లాభాలు వచ్చాయి.  1991 జూలై 18న సినిమా విడుదైలైంది. ‘శ్రీకృష్ణదేవరాయులిగా బాలయ్యను బాగా చూపించారు’ అని ఎన్టీఆర్‌గారు మెచ్చుకున్నారు.

ఇరవై ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా. చాలా అడ్వాన్డ్స్‌గా తీశారని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసించారు  ‘మంచి చిత్రం తీశారండీ’ అని చిరంజీవిగారు ప్రశంసించి, ‘పిల్లలూ మీరు మిస్ కావొద్దు’ అని ప్రత్యేకంగా ఓ ట్రైలర్‌లో నటించారు. విజయశాంతిగారు కూడా ట్రైలర్‌లో నటించారు  తెలుగులో దిగ్విజయంగా వంద రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘అపూర్వశక్తి 369’ పేరుతో, హిందీలో ‘మిషన్ 369’ పేరుతో అనువదించగా.. రెండు భాషల్లోనూ విజయం సాధించింది.

>