పిండిలో నోట్ల క‌ట్ట‌లు: ఇది రాబిన్ హుడ్ ప‌నే

4 May, 2020 12:00 IST|Sakshi

వారం, ప‌ది రోజుల నుంచి బాలీవుడ్‌లో ఓ వార్త బీభ‌త్సంగా చ‌క్కర్లు కొడుతోంది. దీని ప్ర‌కారం ర‌య్‌మంటూ వ‌చ్చిన ఓ ట్ర‌క్కు వీధిలోకి వ‌చ్చి ఆగుతుంది. అందులోని కొంత‌మంది వ్య‌క్తులు పేద‌ల‌కు పిండి ప్యాకెట్లు పంచుతారు. పిండి అవ‌స‌రం లేద‌నుకునే వాళ్లు అక్క‌డి నుంచి వెళ్లిపోతారు. నిజ‌మైన పేద‌వాళ్లు వ‌రుస‌లో నిల‌బ‌డి దాన్ని అందుకుంటారు. అయితే ఆ ప్యాకెట్లు అందుకున్న వాళ్ల‌కు అందులో రూ.15 వేలు క‌నిపిస్తాయి. ఇలా గుట్టుగా సాయం చేసింది అమీర్ ఖా‌నే అని చాలామంది అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా ఈ విష‌యంపై స్పందించిన అమీర్‌.. ఆ వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు. (పేద‌ల‌కు పంచిన పిండిలో రూ.ప‌దిహేను వేలు)

"నేను గోధుమ‌ పిండి సంచుల్లో డ‌బ్బు పెట్ట‌లేదు. ఇది అస‌త్య ప్ర‌చార‌మై ఉండొచ్చు.. లేదంటే త‌న పేరు వెల్ల‌డించ‌డానికి ఇష్ట‌ప‌డని రాబిన్ హుడ్(ధ‌న‌వంతుల‌ను దోచి పేద‌వారికి స‌హాయం చేసే వీరుడి పాత్ర‌) ప‌ని అయి ఉండాలి" అని ట్వీట్ చేశాడు. తాను చేయ‌ని ప‌నికి క్రెడిట్ తీసుకోనందుకు అభిమానులు త‌మ‌ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సంటూ పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు. మ‌రోవైపు ఆ రాబిన్ హుడ్ మీరే అయి ఉండొచ్చేమో అని ఎటుతిరిగీ మ‌ళ్లీ అమీర్ ఖాన్‌కే గురి పెడుతున్నారు. మిగ‌తా నెటిజ‌న్లు మాత్రం ఆ రాబిన్ హుడ్ ఎవరై ఉంటారా? అని ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. కాగా అమీర్‌, త‌న భార్య కిర‌ణ్ రావుతో క‌లిసి ఆదివారం నాడు "ఐ ఫ‌ర్ ఇండియా" లైవ్‌ క‌న్స‌ర్ట్‌లో పాల్గొన్నాడు. ఇందులో పాట‌లు పాడి అభిమానుల‌ను అల‌రింప‌జేసిన‌ అనంత‌రం క‌రోనా పోరాటానికి స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా అభిమానుల‌ను కోరాడు. (నాలుగేళ్లు సినిమాలకు దూరం: ఆమిర్‌)

మరిన్ని వార్తలు