అతడికి బెయిల్‌ వచ్చింది..

24 Apr, 2020 17:29 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌​ నటుడు, హిందీ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అజాజ్‌ ఖాన్‌కు బెయిల్‌ లభించింది. బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తుగా లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన ఆరోపణలతో సైబర్‌ పోలీసులు ఏప్రిల్‌ 18న అజాజ్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై ఐపీసీ 153(ఏ), 121, 117, 188, 501, 504, 505(2) కింద ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇంటరాక్షన్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అతడు మాట్లాడినట్టు ముంబై పోలీసులు ఆరోపించారు. 

‘ఒక చీమ చనిపోయినా ముస్లింలదే బాధ్యత. ఒక ఏనుగు చనిపోయినా ముస్లింలదే బాధ్యత. ఢిల్లీలో భూకంపం వచ్చినా ముస్లింలే కారణమంటారు. దేశంలో ఏ ఘటనా జరిగినా ముస్లింల మీదే అభాండం వేస్తారు. అయితే ఈ కుట్రకు ఎవరు కారణమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?’ అని ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇంటరాక్షన్‌లో అతడు మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. 

అజాజ్‌ ఖాన్‌ గతంలో కూడా అనేక పర్యాయాలు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్రగ్స్‌ కేసులో అతడు కటకటాల పాలయ్యాడు. హిందీ బిగ్‌బాస్‌ 7 సీజన్‌లో పాల్గొన్న అజాజ్‌ ఖాన్‌.. పలు బాలీవుడ్‌ సినిమాలతో పాటు దూకుడు, బాద్‌షా, హార్ట్ ఎటాక్‌, నాయక్‌, టెంపర్‌ వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించాడు.

ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ‌ విజ్ఞప్తి 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు