అంచనాలకు మించిన అభినయం!

3 Dec, 2013 02:30 IST|Sakshi
అంచనాలకు మించిన అభినయం!
శారీరకంగా లోపాన్నిచ్చినా... అంతర్లీనంగా అంతకు మించిన ఏదో శక్తిని ప్రసాదిస్తాడు దేవుడు. అయితే... తమలోని ఆ శక్తి ఏమిటో తెలుసుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అభినయ గురించి. పాత్ర పూర్వాపరాలు ‘విని’.. దానికి తగ్గట్టు అభినయించడం, పాత్రోచితంగా డైలాగులు ‘పలికి’ కేరక్టర్‌కి ప్రాణం పోయడం నటుల విధి. కానీ వినడం, మాట్లాడటం.. ఈ రెంటినీ అభినయకు పుట్టుకతోనే దూరం చేశాడు దేవుడు. కానీ అభినయ యేటికి ఎదురీదింది. విధిని ఎదిరించి, తన తలరాతను తానే మార్చుకుంది. నటిగా గెలిచింది. సక్సెస్‌ఫుల్ ఆర్టిస్టుగా దక్షిణాదిలోని భాషలన్నింటిలో రాణిస్తోంది. తల్లిదండ్రులకు కొండంత పుత్రికోత్సాహాన్నిచ్చింది. తన కుమార్తె గురించి ఆనంద్‌వర్మ చెప్పిన సంగతులు మీ కోసం...
 
 అభినయ మాటలు రావు అని మీకెప్పుడు తెలిసింది?
అభినయ పుట్టడమే చాలా అందంగా పుట్టింది. ఆ అందాన్ని చూసి అప్పుడే ఆమెను నటిని చేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకు తగ్గట్టుగా అభినయ అని పేరు పెట్టాను. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం. ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నాం. అయితే... అందరి పిల్లల్లా కాకుండా ఏదో తేడా ఆమెలో కనిపించేది. ఆమె పక్కన పెద్ద పెద్ద వస్తువులు కిందపడి బద్దలైనా... ఏ మాత్రం స్పందించేది కాదు. ఓ సారి టీవీ ముందు పడుకోబెట్టి పెద్ద సౌండ్ పెట్టేశాను. అభినయ కామ్‌గా ఉండిపోయింది. అప్పుడు నాలో డౌట్ మొదలైంది. సరిగ్గా ఆమె పుట్టిన నెల రోజుల తర్వాత జరిగిన విషయం ఇది. అభినయను చెన్నయ్‌లోని ఓ హాస్పిటల్‌కి తీసుకెళ్తే, ఆమె వినలేదు, మాట్లాడలేదని డాక్టర్లు చెప్పారు. మాకు గుండె పగిలినంత పనైంది. 
 
ఇంట్లో తను ఎలా ఉండేది?
మామూలుగా అలాంటి పిల్లల్ని అందరూ దూరంగా పెడతారు. కానీ మేం అలా చేయలేదు. ఎప్పుడూ ఆమె దగ్గరే ఉండేవాళ్లం. ఆమెక్కూడా చుట్టూ జనం ఉండాలి. ఎప్పుడైనా మేం కాసేపు కనపడకపోయినా చాలా బాధ పడుతుంది. 
 
ఈ లోపం ఉన్నవాళ్లు ఆర్టిస్టు అవడం అసంభవం కదా?
పుట్టినప్పుడు ఆమెను నటిని చేయాలనుకున్నాను కానీ... ఆమెలోని లోపం తెలిశాక... నా కోరికను చంపుకున్నాను. మంచి వర్ఛస్సు కలిగిన అమ్మాయి అవ్వడం వల్ల మోడల్‌ని చేద్దాం అనుకున్నాను. 
 
మరి ఆర్టిస్టుని ఎందుకు చేశారు?
ఆ ధైర్యాన్ని ఓ విధంగా ఆమే మాకు ఇచ్చింది. 9 ఏళ్ల క్రితం ఆమెకు వినికిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించాం. ఆ ఆపరేషన్ మరో రెండురోజుల్లో జరుగుతుందనగా... తనకు ఆపరేషన్ జరుగుతున్న టైమ్‌లో... నా ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ల అమ్మ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయో... యాక్ట్ చేసి చూపించేది. మేం షాక్ అయ్యేవాళ్లం. చిన్నప్పట్నుంచీ ఎవర్నయినా ఇట్టే అనుకరించేది. చిన్నప్పట్నుంచీ ఆమెను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి, తాను మోడల్‌గా కంటే... నటిగానే కరెక్ట్ అనిపించింది. 
 
ఫస్ట్ టైమ్ కెమెరాను ఎలా ఫేస్ చేసింది?
ఆమె తొలి సినిమా ‘నానోడిగల్’. ఫస్ట్‌టైమ్ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు ఆమె యాక్షన్ కంటే... మా టెన్షనే ఎక్కువైపోయింది. అయితే... అందరినీ ఆశ్చర్యానికి లోనుచేస్తూ... ఫస్ట్‌టేక్‌లోనే ఓకే చేసింది. లొకేషన్ మొత్తం హర్షధ్వానాలే. 
 
పాత్ర నడవడిక, సంభాషణలు పలికే తీరు ఎలా తెలుసుకుంటుంది?
తనకు అర్థమయ్యేట్టు చెప్పగలిగేది నా భార్య ఒక్కతే. పైగా లిప్ మూమెంట్‌ని తేలిగ్గా పట్టుకోగల సమర్థత అభినయ సొంతం. ఇటీవల ఓ సినిమా లొకేషన్లో తన అభినయం చూసి సాంకేతిక నిపుణులందరూ అభినందనలతో ముంచెత్తారు. దర్శకుని అంచనాలకు మించి నటించే ప్రతిభాశాలి తను. 
 
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
ఏడు సినిమాలు చేస్తోంది. శౌర్యం శివ దర్శకత్వం అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘వీరం’లో కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమాలో ముందు అభినయ పాత్ర చాలా చిన్నది. ఆమె నటన అజిత్‌కి నచ్చడంతో... పాత్ర నిడివి పెంచారు. విక్రాంత్ హీరోగా రూపొందుతోన్న మరో చిత్రం ‘తిరివి’లో కూడా మంచి పాత్రే. ఈ సినిమాలోని సెంటిమెంట్ సన్నివేశంలో అభినయ నటన చూసి సదరు చిత్ర నిర్మాత లొకేషన్లోనే భావోద్వేగానికి లోనయ్యారు. నాకు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు. ఇంకా వన్ బై టూ అనే మలయాళ చిత్రం... ఇవిగాక ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. 
 
అభినయకు డ్రీమ్ రోల్ ఏదైనా..?
ఆమెకు కాదు కానీ... తండ్రిగా నాకు ఉంది. ఆమెను ఆ అద్భుతమైన పాత్రలో చూడాలని నా కోరిక.