శివకార్తికేయన్‌తో నటించడం సులభం

7 Oct, 2016 02:14 IST|Sakshi
శివకార్తికేయన్‌తో నటించడం సులభం

శివకార్తికేయన్‌తో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉందంటున్నారు నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన మూడు చిత్రాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అందులో ఇదు ఎన్న మాయం చిత్రం యావరేజ్‌గా కాగా, రజనీమురుగన్ సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల విడుదలైన తొడరి సక్సెస్ అనిపించుకుంది. తాజాగా రెండో సారి శివకార్తికేయన్‌తో జత కట్టిన రెమో చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఈ పుత్తడి బొమ్మను సాక్షి పలకరించగా బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. అవేమిటో చూడండి.
 

 ప్ర: రెమో చిత్ర విశేషాల గురించి?
జ: రెమో చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. శుక్రవారం తెరపైకి రానుంది. కాబట్టి చూడబోతూ ఇప్పుడే రుచుల గురించి చెప్పడమెందుకు. అయితే ఇందులో నాది బబ్లీ పాత్ర. రెమో లవ్ ఎంటర్‌టెయినింగ్ థ్రిల్లర్ కథా చిత్రం.
 
ప్ర: నటుడు శివకార్తికేయన్‌కు జంటగా రజనీమురుగన్ చిత్రం తరువాత ఈ చిత్రంలో జత కట్టడం గురించి?
జ: నిజంగా మంచి అనుభవం. శివకార్తికేయన్‌తో ఇంతకు ముందు నటించడంతో రెమో చిత్ర షూటింగ్ చాలా జాలీగా సాగిపోయింది. అందరం చాలా ఎంజాయ్ చేస్తూ నటించాం.
 
ప్ర: విజయ్‌కు జంటగా భైరవా చిత్రంలో నటించడం గురించి ?
జ: చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో నటించాలన్నది నా డ్రీమ్. అది ఇంత త్వరగా నెరవేరుతుందని ఊహించలేదు. విజయ్ డాన్స్‌లో ఎంత వేగమో అందరికీ తెలిసిందే. ఆయనతో డాన్స్ చేయడం అంత సులభం కాదు. రెండు రోజుల క్రితమే విజయ్‌తో కలిసి పాటల సన్నివేశాల్లో నటించారు. ముందు కాస్త భయపడ్డాను. తరువాత గాడిలో పడ్డాను. ఏదేమైనా విజయ్‌తో నటించడం తీయని అనుభవం.
 
ప్ర: విజయ్, దనుష్, శివకార్తికేయన్‌లతో నటించారు. వీరిలో ఎవరితో నటించడం కంఫర్టబుల్ అనిపించింది?
జ: విజయ్ పెద్ద స్టార్. ఆయనతో నటించే అవకాశం వచ్చినప్పుడే కాస్త ఒంట్లో వణుకు పుట్టింది. అయితే ఆయనతో నటించడంతో చాలా నేర్చుకున్నాను. ఇక ధనుష్ నటనలో ఫర్ఫెక్షన్ చూసుకుంటారు. సహ నటీనటులకు సూచనలు ఇస్తారు. శివకార్తికేయన్‌తో ఇంతకు ముందు నటించాను గనుక ఏ విషయాన్నైనా కలిసి చర్చించుకునే క్లోజ్‌నె స్ ఉంటుంది.
 
 ప్ర: మీ తల్లి మేనక నటి, తండ్రి సురేశ్ నిర్మాత కావడం వల్లే మీరూ నటినవ్వాలనుకున్నారా?
 జ: నాది సినీ బ్లడ్ కావడం వల్ల నటినవావ్వలన్న కోరిక కలిగి ఉండవచ్చు. చదువు పూర్తి చేసిన తరువాతే నటన గురించి ఆలోచించమని అమ్మానాన్నలు చెప్పడంతో ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేశాను. బాల నటిగా కొన్ని చిత్రాలు చేశాను.2013లో గీతాంజలి అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యాను.
 
 ప్ర: మీ అక్క రేవతి ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లున్నారు?
 జ: అవును అక్క పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్క వీఎఫ్‌ఎక్స్ సెషలిస్ట్. నటుడు షారూఖ్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ కంపెనీలో పని చేశారు. అక్క దర్శకత్వం చేపట్టాలనే ఆలోచనలో ఉంది.
 
 ప్ర: మీ అక్క దర్శకత్వం వహిస్తే ఆ చిత్రంలో మీరు నటిస్తారా?
 జ: ఎందుకు నటించనూ. అలాంటి ఆలోచన మా ఇద్దరికీ ఉంది.
 
 ప్ర: మలయాళంలో చిత్ర రంగప్రవేశం చేసి ఆ తరువాత తమిళం, తెలుగు అంటూ దక్షిణాది భాషల్లో వరుస కట్టారు. తదుపరి చూపు బాలీవుడ్‌పైనేనా?
 జ: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. మంచి అవకాశం వస్తే హిందీ చిత్రాల్లో నటించడానికి రెడీ.
 
ప్ర: స్టార్ హీరోలతో అవకాశాలు పొందాలంటే గ్లామరన్‌గా నటించాలన్న ఒత్తిడి ఉంటుందంటారు. అలాంటి పరిస్థితి ఎదురైతే అందాలారబోతకు సిద్ధమేనా?
 జ: నిజం చెప్పాలంటే గ్లామరస్ పాత్రలు నా బాడీలాంగ్వేజ్‌కు నప్పవు. అలాంటి పాత్రలను నేను చేయను కూడా. ఇక అవకాశాలను కోల్పోతానని అంటారా’ ఇప్పుడు ప్రేక్షకుల్లో చాలా మార్పు వస్తోంది. మంచి కథా పాత్రలను ఆదరిస్తున్నారు. అందువల్ల నాకు అలాంటి ఒత్తిడి రాదనే భావిస్తున్నా.
 
 ప్ర: ప్రస్తుతం హారర్ చిత్రాల టెండ్ నడుస్తోంది. అలాంటి చిత్రాల్లో అవకాశం వస్తే నటిస్తారా?
 జ: నా తొలి మలయాళ చిత్రం గీతాంజిలి హారర్ కథా ఇతివృత్తంతో కూడుకున్నదే. కాబట్టి పాత్ర నచ్చితే కచ్చితంగా హారర్ కథా చిత్రంలో నటిస్తాను.
 
 ప్ర: సాధారణంగా హీరోయిన్లలో పోటీ ఉంటుంది. మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు?
 జ: నాకు నేనే పోటీ. నా ముందు చిత్రాల కంటే మరింత బెటర్‌గా నటించడానికి ప్రయత్నిస్తాను.
 
ప్ర: ఏ హీరోతో కలిసి నటించాలని ఆశపడుతున్నారు?
జ: అలాగని ఏమీ లేదు. విజయ్, ధనుష్, శివకార్తికేయన్‌లతో ఇప్పటికే నటించాను. అలాగే అందరు హీరోలతోనూ నటించాలని కోరుకుంటాను. మణిరత్నం దర్శకత్వంలో నటించాలన్న కోరిక మాత్రం ఉంది.
 
ప్ర: నటుడు సూర్యతో జత కట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజమేనా?
జ: అది ఇంకా చర్చల్లోనే ఉంది. ప్రస్తుతానికి విజయ్‌తో నటిస్తున్న భైరవాతో పాటు తెలుగులో నానికి జంటగా ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాను. నేను లోకల్ క్రిస్మస్‌కు భైరవా సంక్రాంతికి తెరపైకి రానున్నాయి.