అమ్మతనానికి దగ్గరగా..

15 Apr, 2015 05:12 IST|Sakshi
అమ్మతనానికి దగ్గరగా..

 గత వారం విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తమిళనాట స్థిరపడిన తెలుగింటి ఇల్లాలి పాత్ర చూశారుగా! ఆ పాత్రకు అచ్చంగా సరిపోయిన నటి - నిజజీవితంలో కూడా తమిళనాట స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన స్నేహ. తమిళ యాస కాస్తంత కలిసినా చక్కటి తెలుగు మాట్లాడే స్నేహ ఆ సినిమాలో తానే స్వయంగా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. ‘‘నా మాతృభాషలో నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా అనిపించింది’’ అని స్నేహ అన్నారు.
 
 ఆ సినిమాకూ, పాత్రకూ కుటుంబ ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో పాటు ఇప్పుడు మరో ఆనందం ఆమెకు త్వరలోనే అందనుంది. అది ఏమిటంటే - త్వరలోనే ఆమె నిజజీవితంలో అమ్మ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న స్నేహ, ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నను మూడేళ్ళ క్రితం 2012లో పెళ్ళాడిన సంగతి తెలిసిందే. ఆ తరువాతా ఆమె ఎంపిక చేసుకున్న మంచి పాత్రలను పోషిస్తూనే, ఆనందంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
 
 ఆ దంపతులకు ఇప్పుడు తొలి సంతానం కలగనుంది. తమిళ సంవత్సరాది అయిన మంగళవారం నాడు ప్రసన్న ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకుంటూ, ‘‘ఈ శుభదినాన మీ అందరితో మరో తీపి కబురు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఇంటికి మరో కొత్త వ్యక్తి వచ్చి చేరుతున్నారు. దాని కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొ న్నారు. అంటే, త్వరలోనే నిజజీవిత తల్లి పాత్రలో స్నేహ మార్కులు కొట్టేయనున్నారన్నమాట!