తిడతారని తెలుసు.. అయినా ఆ పాటను చేశాం!

23 Mar, 2018 20:32 IST|Sakshi

సాక్షి, సినిమా : ఆణిముత్యాల్లాంటి సినిమాలనుగానీ, పాటలను గానీ రీమేక్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటిని చెడగొట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్‌లో అలాంటిదే ఒకటి జరిగింది. 

1988లో తేజబ్‌ సినిమాలోని ఏక్‌ దో తీన్‌ సాంగ్‌ను తాజాగా బాఘీ-2 చిత్రం కోసం రీమిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. క్లాసిక్‌ సాంగ్‌లో మాధురి దీక్షిత్‌ స్టెప్పులు ఇరగదీస్తే... ఇప్పుడీ కొత్త పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ చిందులేసింది. అయితే పాట క్వాలిటీ పరంగానే కాదు.. విజువల్‌గా, డాన్సుల పరంగా కూడా అంత బాగోలేదని విమర్శకులు పెదవి విరిచేశారు. పైగా సోషల్‌ మీడియాలో ఈ ప్రయత్నంపై  చిత్ర దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌పై ప్రేక్షకులు కొందరు దుమ్మెత్తిపోశారు. 

దర్శకుడి వివరణ... ఈ నేపథ్యంలో దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌ స్పందించాడు. పాటను సినిమాలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే విమర్శలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక పాటకు డాన్సులు సమకూర్చుంది అహ్మదేనంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా ఆయన స్పందించారు. ‘ఆ పాటను ప్రముఖ డాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య కంపోజ్‌ చేశారు. ఆ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. పైగా పాట చిత్రీకరణ జరుపుకున్న సమయంలో ఆ దరిదాపులకు కూడా నేను వెళ్లలేదు’ అని అహ్మద్‌ చెప్పుకొచ్చాడు. 

‘పాటను నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. కేవలం క్లాసిక్‌ పాటకు ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేద్దామన్న ప్రయత్నం మాత్రమే మాది. అయినా ఈ పాటపై విమర్శించే వారిని మేం పట్టించుకోలేదల్చుకోలేదు. కాకపోతే ఈ పాటపై మాధురి దీక్షిత్‌ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌తోపాటు ఈ పాట ఒరిజినల్‌ కంపోజర్‌(తేజబ్‌ చిత్రం) సరోజ్‌ ఖాన్‌ కూడా ఈ ప్రయత్నంపై అభినందనలు గుప్పిస్తూ.. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.  టైగర్‌ ష్రాఫ్‌, దిశా పఠానీ జంటగా నటించిన భాఘీ తెలుగు క్షణం సినిమాకు రీమేక్‌. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. 
 

మరిన్ని వార్తలు