ఇది జీవితకాలపు బహుమతి

13 Jan, 2020 00:09 IST|Sakshi
రాధాకృష్ణ, అల్లు అరవింద్‌

– అల్లు అరవింద్‌

‘‘నిర్మాతల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఫోన్‌వైపు చూస్తూ ఉంటే ఒక్క కాల్‌ కూడా రాదు. వచ్చేప్పుడు మనం ఆపినా ఆగవు. ‘అల.. వైకుంఠపురములో..’ విడుదల అయినప్పటి నుంచి  తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు కూడా కాల్‌ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రేక్షకులు, బన్నీ (అల్లు అర్జున్‌) అభిమానులు పండగలో మరో పండగ వాతావరణం మాకు అందించారు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలయింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘సామజవరగమన..’, ‘రాములో రాములా’ పాటలు ఇంత రేంజ్‌లో హిట్‌ అవుతాయని ఊహించలేదు.. అదంతా మేమిచ్చిన సంగీతం అనడం లేదు. ప్రేక్షకులు మాకు పెట్టిన భిక్ష. ప్రేక్షకులకు, బన్నీ అభిమానులకు కృతజ్ఞతలు. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో మా సినిమాను కొన్న బయ్యర్స్‌ అంతా మొదటిరోజు సాయంత్రానికే లాభాల్లో ఉన్నారని చెప్పారు. మా బ్యానర్‌కి వరుసగా ‘ప్రతిరోజూ పండగే, అల.. వైకుంఠపురములో..’ రూపంలో రెండు హిట్స్‌ వచ్చాయి.

2019కి అది ఒకటి వీడ్కోలు అయితే 2020కి మరొకటి స్వాగతం అనుకుంటున్నాను. గ్యాప్‌ తీసుకున్నందుకు బన్నీని నేను ఏం అనకూడదు.. వాడే నన్ను అనాలి. తన కాల్షీట్లు మా దగ్గర (గీతా ఆర్ట్స్‌) ఉన్నాయి. సరైన కథ, దర్శకుడిని తొందరగా తీసుకురాలేకపోయినందుకు మమ్మల్ని తను అనాలి. రెండు సంస్థలు కలిసి పని చేయడమే కొత్త బిజినెస్‌ టెక్నిక్‌. సినిమానే కాదు.. ఏ వ్యాపారమైనా కలిసి పని చేస్తున్నారు.. అలా చేసినప్పుడు రెండు ప్లస్‌ రెండు నాలుగు అవ్వదు.. ఆరు అవుతుంది. ఈ ట్రెండ్‌ని ‘పెళ్లి సందడి’ అప్పుడే చేశాం.

రాధాకృష్ణగారితో కలిసి పనిచేయడం మా అదృష్టం. ఒకేలాంటి ఆలోచనలున్న వ్యక్తులైతే కలిసి పని చేయడం సులభం.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలున్నాయి. బన్నీ ఈ సినిమాలో బాగా నటించాడు. సంక్రాంతి  పండుగ రెండు వీకెండ్స్‌ మధ్యలో వచ్చింది.. దాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రకటించిన తేదీకంటే ముందు వద్దామనుకున్నాం. ఈ సినిమా సక్సెస్‌ నా బర్త్‌డే (శనివారం) గిఫ్ట్‌ కంటే గొప్పది. ఇది జీవితకాలపు బహుమతి. బర్త్‌డేలు ప్రతి ఏడాది వస్తాయి. కానీ, ఇలాంటి గిఫ్ట్స్‌ జీవితంలో 10–12 సార్లే వస్తాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు