సెన్సేషనల్‌ అవుతుందనుకోలేదు: అల్లు అర్జున్‌

7 Jan, 2020 03:29 IST|Sakshi
నివేదా, త్రివిక్రమ్, అల్లు అర్జున్, సీతారామ శాస్త్రి, అల్లు అరవింద్, రాధాకృష్ణ, తమన్, సుశాంత్‌

‘‘నాకు చిరంజీవిగారంటే ప్రాణం. ఇక్కడ చాలామంది పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడమంటున్నారు.. మీకోసం అంటున్నా పవర్‌స్టార్‌గారు.. కానీ, నాకు మాత్రం చిరంజీవిగారంటే ప్రాణం.. ఈ కట్టె కాలేంత వరకూ ఆయన అభిమానినే.. చిరంజీవిగారి తర్వాత నేను అంతగా అభిమానించేది రజనీకాంత్‌గారినే. ఆయన రోల్‌ మోడల్‌’’ అన్నారు అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. మమత సమర్పణలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ‘మ్యూజికల్‌ కన్సర్ట్‌’లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలకు చాలా గ్యాప్‌ వచ్చింది.. నేను ఇవ్వలా.. వచ్చింది. ‘సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా. కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌లో గ్యాప్‌ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు.

మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్‌ బ్యాండ్‌ కల్చర్‌ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. శనివారం అందరూ వెళుతుంటారు. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది.. ముందు నచ్చేది కాదు. కానీ, ఖాళీగా ఉన్న రోజుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సేఫ్‌ (నవ్వుతూ).. అందుకే తనవెంట వెళ్లేవాణ్ణి.. అందరి మ్యూజిక్‌ బ్యాండ్స్‌లో నా పాట ఉండాలి అని తమన్, త్రివిక్రమ్‌గారితో అన్నాను. నేను ఒట్టేసి చెబుతున్నా ‘సామజ వరగమన...’ పాట ఇంత సెన్సేషనల్‌ అవుతుందని కలలో కూడా అనుకోలేదు.

ఓ రోజు మా ఆవిడ ఇంటికొచ్చి.. ‘ఎక్కడ చూసినా ఈ పాటే ప్లే చేస్తున్నారు.. విసుగొస్తోంది.. పైగా అందరూ నన్ను చూసి పాడుతుండటంతో సిగ్గుతో వచ్చేశా’ అని చెప్పినప్పుడు నాకు అనిపించింది.. ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కన్నా భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి ఉంటుందని. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రిగారికి, పాడిన సిద్‌ శ్రీరామ్‌గారికి, మంచి సంగీతం అందించిన తమన్‌గారికి, వీరి ముగ్గుర్ని బాగా కోఆర్డినేట్‌ చేసిన త్రివిక్రమ్‌గారికి, ఈ సినిమాలో పాటలు రాసిన వారందరికీ థ్యాంక్స్‌.నా ‘జులాయి’ సినిమాతో ఆరంభమైన హారికా అండ్‌ హాసినీ బ్యానర్‌ ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు రాధాకృష్ణగారు, వంశీలను అభినందిస్తున్నా. నాకు తెలిసి మూడుసార్లు ఏ డైరెక్టర్‌తోనూ చేయలేదు.. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాపై త్రివిక్రమ్‌గారికి ఉన్న నమ్మకం ఎక్కువ.. నాకు హిట్‌ సినిమాలు ఇచ్చినందుకు థ్యాంక్స్‌ సార్‌.. ఈ సినిమాతో మరో హిట్‌ ఇవ్వబోయేది కూడా ఆయనే. ఏడాదిన్నరగా ఇంటిలో ఉన్నా నాకు ఈ గ్యాప్‌ ఒక్క సెకనులా అనిపించిందంటే అది నా అభిమానుల వల్లే.. ఎవరికైనా అభిమానులుంటారు.. నాకు ఆర్మీ ఉంది’’ అల్లు అర్జున్‌ అన్నారు.

పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా రాశారు రచయితలందరూ. అల్లు అర్జున్‌ మంచి సంస్కారవంతుడు. ‘సామజ వరగమన..’ పాటని 13కోట్ల మంది విన్నారట. అంటే.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారూ మనసుతో విన్నారు. ఈ పాటని నేను చాలా కుర్రతనంతో రాశానని చాలా మంది అన్నారు.. నేను కుర్రాణ్ణి కాదు.. అల్లు అర్జున్‌ని అయిపోయానిక్కడ. అంత స్పష్టంగా నాతో పాట రాయించుకున్నాడు త్రివిక్రమ్‌. తమన్‌ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘మేం సపోర్ట్‌గా ఉన్నా ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే నా ఫ్రెండ్‌ రాధాకృష్ణ కష్టపడటం వల్లే.. త్రివిక్రమ్‌ మాకు చిన్న కథ చెప్పి ఇంత పెద్ద సినిమా తీశాడు. సినిమా విడుదలకు ముందే హిట్‌ టాక్‌ వచ్చింది మీ వల్లే (అభిమానులు). 2019కి నేను వీడ్కోలు చెప్పడానికి తమన్‌ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చాడు.. 2020కి స్వాగతం పలకడానికి ‘అల వైకుంఠపురములో’ ఇచ్చాడు.. థ్యాంక్యూ తమన్‌’’ అన్నారు.     

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘బన్నీ డ్యాన్సులతో, తమన్‌ పాటలతో, త్రివిక్రమ్‌గారు పంచ్‌లతో ఇరగ్గొట్టేస్తారు.. ఇక సినిమా బాగుందని మెగాఫ్యాన్స్‌ అంటే చాలు.. ఈ సంక్రాంతికి ఇరగ్గొట్టేస్తారు’’ అన్నారు.
త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘సీతారామశాస్త్రిగారు, తమన్‌ ఓ మధ్యాహ్నం కూనిరాగం తీసుకుంటూ పాడిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే ‘సామజవరగమన..’. తన వయసు నుంచి దిగి సీతారామశాస్త్రిగారు, తన స్థాయి నుంచి ఎక్కి తమన్‌ ఇద్దరూ కలసి ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారు. సంగీతాన్ని గౌరవించాలనే మ్యూజికల్‌ నైట్‌ ఈవెంట్‌ పెట్టాం. ‘జులాయి’ అప్పుడు బన్నీ పెళ్లి కాని యువకుడు.

ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రి. తన తాలూకు మెచ్యూరిటీ ఈ సినిమాలోనూ పెట్టాడు. మేం కన్న కల మీ అందరికీ ఓ జ్ఞాపకం అవ్వాలి. మేం అడిగిందల్లా ఇచ్చారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ. సంగీతం అంటే మనసు దురదపెట్టినప్పుడు గోక్కునే దువ్వెన లాంటిది. తల దురద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసు దురద పెడితే కావాల్సింది సంగీతమే. వేటూరి, ఆ తర్వాత సీతారామశాస్త్రిగార్లు ‘వాడు సినిమా వాడురా నుంచి ఆయన సినిమాకు పాటలు రాస్తాడు’ అనే స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తులు. ఈ సినిమాకు మొదలు, ముగింపు అల్లు అర్జున్‌. ఇందులో అల్లు అయాన్, అల్లు అర్హా నటించారు’’ అన్నారు.

సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ– ‘‘మీ (ఫ్యాన్స్‌)లాగా నేను కూడా బన్నీకి పెద్ద అభిమానిని. ఒక అభిమానిగా ఉంటేనే ఇంత బాగా కంపోజ్‌ చేయగలం. త్రివిక్రమ్‌గారు లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. గీతా ఆర్ట్స్, హారిక అండ్‌ హాసినీ టీమ్‌ రేయింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు’’ అన్నారు.

 నటి టబు మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితే నాకు మంచి రీ ఎంట్రీ అవుతుంది’’ అన్నారు.

నిర్మాతలు రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, ‘బన్నీ’ వాస్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణచైతన్య, నటులు సునీల్, సముద్ర ఖని, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్, నటీనటులు రోహిణి, సుశాంత్, అల్లు శిరీశ్, డ్రమ్స్‌ శివమణి, గాయకుడు సిద్‌ శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా