జెనీవాలో శ్రుతిహాసన్‌తో...అల్లు అర్జున్‘రేసుగుర్రం’

4 Jul, 2013 02:03 IST|Sakshi
జెనీవాలో శ్రుతిహాసన్‌తో...అల్లు అర్జున్‘రేసుగుర్రం’
వేగం, చురుకుదనం... ‘రేసుగుర్రం’ ఆభరణాలు. సరిగ్గా అల్లు అర్జున్ ఆభరణాలు కూడా అవే. సినీ రంగంలో శిఖరాగ్రానికి దూసుకెళుతున్న ‘రేసుగుర్రం’ అతను. అందుకే బన్నీకి ఈ టైటిల్ సరిగ్గా యాప్ట్. ఆ టైటిల్‌కి తగ్గట్టే ఇందులో అల్లు అర్జున్ కేరక్టర్ ఉంటుందని సమాచారం. ఇప్పటివరకూ బన్నీ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
 
 రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే ప్రధాన బలంగా నిలుస్తుందని వినికిడి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.వెంకటేశ్వరరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ నిమిత్తం చిత్రం యూనిట్ జెనీవా చేరుకుంది. 
 
అక్కడ శ్రుతిహాసన్, బన్నీలపై పాటలను చిత్రీకరించనున్నారు. ‘కిక్’శ్యామ్, ప్రకాష్‌రాజ్, సుహాసిని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్‌రుషి, అశిష్ విద్యార్థి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, నిర్మాణం: లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్.