నన్ను నేను  వెతుక్కుంటాను!

1 May, 2019 00:00 IST|Sakshi

‘‘ఇండస్ట్రీలో పదహారేళ్లు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకూ ఎక్కువగా తెలుగు సినిమాలు చేశాను. ఇకపై ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అల్లు అర్జున్‌. హీరోగా ‘గంగోత్రి’ నుంచి ‘డీజే’ వరకూ ఎప్పటికప్పుడు నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు మూడు సినిమాలను (త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరామ్‌ దర్శకత్వాల్లో) లైన్లో పెట్టి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అల్లు అర్జున్‌. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.

∙‘మా’ టీవీలో మా నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్‌), నేను బోర్డ్‌ మెంబర్స్, షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నప్పుడు అంటే స్టార్‌ ‘మా’ టెలివిజన్‌కు ‘మా’ చానెల్‌ను విక్రయించక ముందు ఓ సందర్భంలో బిగ్‌ బాస్‌ 1, 2కి హోస్ట్‌గా చేయమని నన్ను అడిగారు. కానీ అది సరైన సమయం కాదనిపించింది. పైగా మంచి ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఆ తర్వాత ఎవరినైతే వారు హోస్ట్‌గా ఎంపిక చేశారో వారు ఆ షోను అద్భుతంగా చేశారు. ∙నేను ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో.. నా వ్యవహారంలో నెపోటిజమ్‌ (బంధుప్రీతి) లేదని చెప్పుకోలేను. కానీ ఒక్క విషయం.. నెపోటిజమ్‌ ఉన్నా, లేకున్నా ఇండస్ట్రీలో మనల్ని నిలబెట్టేది మనలో ఉన్న ప్రతిభ మాత్రమే అన్నది నా అభిప్రాయం. ∙నన్ను నేను గూగుల్‌లో వెతుక్కుంటుంటాను. నా గత సినిమాల్లో నా లుక్స్‌ ఎలా ఉన్నాయి? చేయబోయే సినిమాల్లో నా గెటప్‌ ఎలా ఉండాలనే విషయాలను విశ్లేషించుకోవడానికి సోషల్‌ మీడియాలో ఉన్న నా ఫొటోలను చూస్తుంటాను. ప్రతి సినిమాకు సమ్‌థింగ్‌ స్పెషల్‌ ట్రై చేయాలన్నదే నా అభిమతం. 

మరిన్ని వార్తలు