ప్రభుదేవా నోట పాట

10 May, 2016 02:53 IST|Sakshi
ప్రభుదేవా నోట పాట

తమిళసినిమా: కథానాయకులు పాడటం అన్నది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. కమలహాసన్ నుంచి శింబు, ధనుష్‌ల వరకూ పలువురు పాడి తమ అభిమానులను అలరించారు. ఆ కోవలో ఇప్పుడు ప్రభుదేవా చేరారు. నృత్యదర్శకుడు,నటుడు, దర్శకుడుగా దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రభుదేవా ఇటీవల నిర్మాతగా కూడా అవతారమెత్తారు. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న ప్రభుదేవా ఇన్ని శాఖల్లో ప్రతిభను చాటుకున్నా గాయకుడిగా గళమెత్తలేదు. అలాంటిది ఇప్పుడు తన గొంతు సవరించుకుని ఒక ప్రయోగాత్మక పాటతో గాయకుడిననిపించుకున్నారు.

ఈయన పాడింది సినిమాకు కాదు. ఎన్నికలపై అవగాహన కలిగించే సందేశాత్మక పాటను ఇటీవల ఆలపించారు .ఓటు హక్కు అవశ్యకతను వివరించే ఈ పాటను గీత రచయిత యుగభారతి రాశారు. అందరూ ఓటు వేయాలి,నూరు శాతం ఓట్లు నమోదు కావాలి అని సాగే ఈ పాటలో నోటుకు ఎందుకు నోటు అంటూ ప్రజలను ఉత్తేజపరచే పదాలు చోటు చేసుకుంటాయి.ప్రభుదేవా పాడిన ఈ పాట తరువాత శింబు కూడా ఓటుకు సంబంధించి ఒక పాట పాడనున్నారు. మొత్తం మీద తమిళనాట జరగన్ను ఈ ఎన్నికలు ప్రభుదేవాను గాయకుడిని చేశాయన్న మాట.