నాదీ ఓరుగల్లే: కథానాయిక ఇషా

1 Sep, 2013 15:23 IST|Sakshi
నాదీ ఓరుగల్లే: కథానాయిక ఇషా

నాకు నచ్చిన ప్రదేశాల్లో వరంగల్ కూడా ఒకటి. ఈ నగరం ఎంతో అందంగా ఉంది. మా బంధువులంతా ఇక్కడే ఉంటారు.. అంటూ హుషారుగా చెప్పుకొచ్చారు అంతకుముందు.. ఆ తరువాత సినిమా కథానాయిక ఇషా. వరంగల్‌లో నిర్వహించిన సినిమా విజయోత్సవ మీట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు.
 
మాది హసన్‌పర్తి.  తాతయ్య, నాన్నమ్మ, పెదనాన్న ఇక్కడే ఉంటారు. నాన్న హైదరాబాద్‌లోని బీహెచ్‌ఎల్‌లో ఉద్యోగం చేసేవారు. దీంతో అక్కడ సెటిలయ్యాం. నేను హైదరాబాద్‌లోనే ఎంబీఏ పూర్తిచేశా. బంధువుల ఇళ్లలో జరిగే ప్రతీ ఫంక్షన్‌కు నేను తప్పకుండా హాజరవుతుంటా.
 
హీరోయిన్ అవుతానని అనుకోలే..
మొదట్లో నేను మోడలింగ్, యాడ్స్ చేసేదానిని. అవి నచ్చడంతో ‘అంతకుముందు.. ఆ తరువాత’ దర్శకుడు హీరోయిన్‌గా చేస్తావా అని అడిగారు. ఆయన పెట్టిన టెస్ట్‌లో పాసయ్యా. అవకాశం వచ్చింది కదా అని ప్రయత్నించా. నా నటన నచ్చడంతో డెరైక్టర్ నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అసలు నేను హీరోయిన్ అవుతానని అనుకోలే.
 
షూటింగ్ అంటే తెలియదు
సినిమా షూటింగ్ అంటే నాకు అసలు తెలియదు. దీం తో నాకు మొదట్లో కాస్త భయం వేసేది. కానీ మొదటి చాన్స్.. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని పట్టుదలతో ముందు కు సాగా. షూటింగ్ విజయవంతంగా పూర్తిచేశా. ఈ సినిమా లో నాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా.
 
వరంగల్ సూపర్
వరంగల్ నా నేటివ్ ప్లేస్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నాయి. ఓరుగల్లు నాకు సూపర్‌గా నచ్చింది. నాకు నచ్చిన పర్యాటక ప్రదేశాల్లో వరంగల్ కూడా ఒకటి. ఇక్కడి వేయిస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయానికి నేను వరంగల్ వచ్చిన ప్రతిసారీ వెళ్తుంటా. ఇవంటే నాకు చాలా ఇష్టం.
 
వరంగల్.. మా లక్కీ జిల్లా: హీరో సుమంత్ అశ్విన్
మా ఫ్యామిలీకి వరంగల్ సెంటిమెంట్. నేనిక్కడికి రావడం ఇది రెండోసారి. వరంగల్ అంటే నాకు ఎంతో ఇష్టం.. అంటున్న హీరో సుమంత్ అశ్విన్ చెబుతున్న మరికొన్ని ముచ్చట్టు.. వర్షం సినిమాని వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో షూట్ చేశాం. సినిమాలో వరంగల్ పేరు సైతం వాడాం. ఆ సినిమా విజయవంతం కావడంతో మా నాన్న ఎంఎస్ రాజుకు అది టర్నింగ్ పాయింట్ అయింది. ఇక అప్పటి నుంచి మేం వరంగల్‌ను లక్కీ జిల్లాగా భావిస్తాం. ఇది మాకు సెంటిమెంట్ కూడా అయింది.

దీంతో నేను నటించిన అంతకుముందు.. ఆ తరువాత సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని వరంగల్‌లో పెట్టాలని మా డెరైక్టర్‌ను కోరా. ఆయన అంగీకరించారు. నాక్కూడా జిల్లా కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేశాం. వర్షం సినిమాకు నేను అసిస్టెంట్‌గా పని చేశా. ఆ సినిమా షూటింగ్ వరంగల్‌లో జరిగినన్ని రోజులూ ఇక్కడే ఉన్నా. వేయిస్థంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం నాకు బాగా నచ్చిన ప్రదేశాలు. మొదటిసారి వర్షం సినిమాకు వచ్చా. ఈసారి నేను హీరోగా నటించిన సినిమా విజయోత్సవ సభకు రావడం నేను మర్చిపోలేని అనుభూతి.  
 
వరంగల్‌లో ‘అంతకుముందు..ఆ తరువాత’
వరంగల్ నగరంలో అంతకుముందు.. ఆ తరువాత చిత్రయూనిట్ సందడి చేసింది. జెమినీ థియేటర్‌లో శనివారం నిర్వహించిన ఆ సినిమా విజయోత్సవ మీట్‌కు హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ ఇషా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హాజరయ్యారు. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ హుషారెత్తించారు. చిత్ర యూనిట్‌కు థియేటర్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది.
 
బీఎస్‌కేను సందర్శించిన యూనిట్
ములుగు రోడ్ సమీపంలోని బీఎస్‌కే జ్యూవలరీ షాప్‌ను సినిమా యూనిట్ సందర్శించింది.  బీఎస్‌కే జూవరలరీ ఎండీ బొల్లం సంపత్ కుమార్ యూనిట్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. షోరూం అంతా తిరిగి కొత్త మోడల్ ఆభరణాల గురించి హీరోహీరోయిన్లు అడిగి తెలుసుకున్నారు.