నాగబాబు వ్యాఖ్యలపై నో కామెంట్‌ : బాలకృష్ణ

8 Jan, 2019 11:13 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి పీజేఆర్‌ మూవీ ల్యాండ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్‌ విగ్రహాలు పెడుతున్నామన్నారు. సీఎంగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారని, అదే రోజు ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాన్ని యాధృచ్చికంగానే విడుదల చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాతో తండ్రి రుణం తీర్చుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ను అనుకరించడం కాదు.. ఆయన పాత్రలో జీవించానని పేర్కొన్నారు.

నాగబాబు వ్యాఖ్యలపై నోకామెంట్‌ అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బాలయ్య బదులిచ్చారు. కుమారుడు, తండ్రి పాత్ర చేయడం ప్రపంచంలోనే రికార్డు అన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా అమ్మరుణం కొంతమేర తీర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌లో చాలామందికి కనిపించని ఎన్నో కోణాలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. క్రిష్‌ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని, ఫిబ్రవరి 7న రెండో భాగం విడుదలవుతుందన్నారు. నటి విద్యాబాలన్‌ అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారని తెలిపారు.

'పండగకు ముందే తెలుగు వాళ్లు పండగ చేసుకుంటారు. బాలకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తాత ఏఎన్నార్‌ పాత్ర నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఓ సినిమా మాత్రమే కాదు, ఓ చరిత్రలా మిగిలిపోతుంది' అని హీరో సుమంత్‌ అన్నారు. ఎన్టీఆర్‌ మనవడిగా కాకుండా ఓ అభిమానిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నానని హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు