పన్నెండు గంటలకు... 11 కోట్లేనా?

3 Dec, 2014 22:37 IST|Sakshi
పన్నెండు గంటలకు... 11 కోట్లేనా?

 ‘‘హుద్‌హుద్ బాధితులను ఆదుకోవడం కోసం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం రెండు గంటల పాటు చిత్తూరులో ఓ కార్యక్రమం చేస్తే... కోటి రూపాయలు సమకూరాయి. అలాంటిది... యావత్ చిత్ర పరిశ్రమ ఒకటిగా నిలిచి పన్నెండు గంటల పాటు ఓ కార్యక్రమం చేస్తే ఎంత పోగవ్వాలి? కానీ, కేవలం 11 కోట్లు మాత్రమే సమకూరింది. ఇందుకు కారణం ముందస్తు ప్రణాళిక, కట్టడి లేకపోవడమే’’ అని సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడి భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. గత ఆదివారం జరిగిన ‘మేము సైతం’ కార్యక్రమంలో డాన్స్ ఈవెంట్స్ అన్నీ తమ్మారెడ్డి భరద్వాజ్ ఆధ్వర్యంలోనే జరిగాయి.
 
  ఈ కార్యక్రమంలో చెన్నయ్ డాన్సర్లతో నిమిత్తం లేకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి కారకులైన స్థానిక కొరియో గ్రాఫర్లనూ, డాన్సర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘స్టార్ హీరోలు హాజరైన ‘మేము సైతం’ కార్యక్రమానికి అరాకొరా సినిమాలు చేసే చిన్న హీరోలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని భరద్వాజ్ ఆవేదన వెలిబుచ్చారు. హీరోయిన్లయితే.. విందు వినోదాలుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలకు హాజరవ్వరనీ, ఆ మాట స్వయంగా వారే అన్న సందర్భాలూ ఉన్నాయనీ భరద్వాజ్ గుర్తు చేసుకున్నారు.