‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

25 Aug, 2019 07:33 IST|Sakshi

తనకూ గంజాయి అలవాటు ఉండేదని ప్రముఖ సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్‌ బహిరంగంగా వెల్లడించారు. మోతీ ఆర్ట్స్‌ పతాకంపై మోతీఫా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం కోలా. ఈయన మాజీ పోలీస్‌అధికారి కూడా కావటం విశేషం. విక్కీఆద్మియ, వైశాక్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాలో నటి హరిణి హీరోయిన్‌గా నటించింది. కణ్మణిరాజా సంగీతా న్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించిన దర్శక, నటుడు కే. భాగ్యరాజ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్ర సంగీతదర్శకుడు మా ఊరు వారు కావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రం లోని పాటలకు నృత్యదర్శకురాలు రాధిక చాలా చక్కగా కొరియెగ్రఫీ చేశారని ప్రశంసించారు. ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు. ఫైట్‌మాస్టర్‌ జాగ్వుర్‌తంగం గంజాయి అలవాటు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారన్న భాగ్యరాజ, ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు.

ఒకసారి తన సహాయకుడొకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. గంజాయి తీసుకుంటే ఎందుకో కారణం తెలియకుండానే నవ్వేస్తుంటామని చెప్పారు. అలా గంజాయికి అలవాటు పడిన తాను ఒక సమయంలో ఏదేదో సాధించాలని వచ్చి ఇలా అయిపోయానేంటి? అన్న ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సిగరెట్‌ తాగడం కూడా మానేశానని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా