ప్రతిసారి ఇలాగే జరుగుతోంది

17 Dec, 2019 20:33 IST|Sakshi

ముంబై: ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు నిరసించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. తమ మదిలో ఏముందో వెల్లడించిన అమాయకులపై అమానవీయంగా దాడి చేస్తారా? హీరోయిన్‌ పరిణీతి చోప్రా ప్రశ్నించారు. పౌరులు తమ ఆలోచనలను బయపెట్టిన ప్రతిసారి ఇలాగే జరుగుతోందని, ఇలాయితే మనదేశాన్ని ప్రజాస్వామ్య దేశం అనగలమా అని నిలదీశారు.

శాంతియుత నిరసనలతో తమ గళాన్ని విన్పిస్తున్న పౌరులపై హింస్మాతక చర్యలకు దిగడం బాధాకరమని హీరో సిద్ధార్థ మల్హోత్రా అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎటువంటి హింసకు తావులేదని, పోలీసులను చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను తెలిపే హక్కు ప్రజలకు ఉందని హీరో విక్కీ కౌశల్‌ పేర్కొన్నారు. హింసతో పౌరులను అడ్డుకోవడం సాటి పౌరుడిగా తనకు ఆందోళన కలిగిస్తోందని ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం సడలకుండా చూసుకోవాలని హితవు పలికారు. జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడి.. అనాగరికం, అప్రజాస్వామికం, లౌకికవాదానికి విరుద్ధమని పులకిత్‌ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐకమత్యమే తమ మతమని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆయన ట్వీట్‌ చేశారు.

చెత్త రాజకీయాలు, హింసాత్మక చర్యలు ఆపాలని సౌరభ్‌ శుక్లా డిమాండ్‌ చేశారు. భావప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పుస్తకాలకు పరిమితమయ్యాయని హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న మన దేశంలో పౌరుల హక్కులను నిజంగా గౌరవిస్తున్నామా అని ప్రశ్నించారు. ఢిల్లీ విద్యార్థులకు తన మద్దతు తెలిపారు. హింస దేనికి పరిష్కారం కాదన్నారు. లౌకికవాద ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నది నిజం కాదని తేలిపోయిందని నటి హ్యూమా ఖురేషి అన్నారు. ఢిల్లీ విద్యార్థులపై పోలీసులు హింసకు దిగడం భయాందోళన కలిగించిందని ఆవేదన చెందారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందన్నారు. (నటుడు సుశాంత్‌ సింగ్‌పై వేటు)

మరిన్ని వార్తలు