డైరెక్టర్ పై లైంగిక వేధింపుల కేసు!

7 Apr, 2017 12:35 IST|Sakshi
డైరెక్టర్ పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై: జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు వికాస్ బెహల్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. క్వీన్ చిత్రంతో బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలందుకున్న డైరెక్టర్  వికాస్ బెహల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయనకు చెందిన ఫాంటమ్ ఫిల్మ్ సంస్థకు పనిచేసిన యువతి ఆరోపించింది. గోవా టూర్ కు వెళ్లిన సమయంలో వికాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫాంటమ్ ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకులలో వికాస్ ఒకరని తెలిసిందే.

ఈ విషయాన్ని బాధిత యువతి అనురాగ్ కశ్యఫ్, విక్రమాదిత్య మోత్వాని, మధు మంథెనాల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని కోరినట్లు ముంబై మిర్రర్ లో వివరాలు వెల్లడయ్యాయి. గతంలోనే ఫాంటమ్ ఫిల్మ్ సంస్థకు చెందిన మహిళా ఆర్టిస్టులు, ఉద్యోగులతో మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చాయని మధు మంథెనా తెలిపారు. గత నెల 28నుంచి ఆఫీసుకి రావడం లేదని, తన బాధ్యతల నుంచి డైరెక్టర్ వికాస్ తప్పుకున్నారని ముంబై మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

లైంగిక వేధింపుల ఘటనపై దర్శకుడు వికాస్ బెహల్ స్పందించారు. ’యువతి మా సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి కాదు. ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వాస్తవం కాదు. గోవాలో ఆమెతో కలిసి పనిచేశాను. ఆ సందర్భంలో ఆమెతో ఏ సందర్భంలోనూ హద్దు మీరి ప్రవర్తించలేదు. నేను తనను గాయపరిచినట్లు భావిస్తే... ఆమెకు క్షమాపణ చెబుతున్నాను’  అని వికాస్ బెహల్ అన్నారు.

>