హృదయాలయంలో గురువర్యులు

5 Sep, 2019 12:42 IST|Sakshi

చదువు నేర్పిన ఆచార్యులను స్మరించుకున్న ప్రముఖులు

తల్లే నా బెస్ట్‌ టీచర్‌: సినీ హీరోయిన్‌ రీతూవర్మ

సామాజిక దృక్పథమే నడిపించిందన్న హరిచందన ఐఏఎస్‌

చిన్నప్పుడే టీచర్‌ మన్ననలు పొందాను: సుమతి ఐపీఎస్‌

నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

చిన్నప్పుడు అమ్మానాన్నలు చేయి పట్టి నడక నేర్పిస్తే.. కాస్త పెద్దయ్యాక అక్షరాలు దిద్దించి.. జ్ఞానమార్గం చూపించి జీవన ప్రదాతలుగా.. మన ఉన్నతికి మార్గదర్శకులుగా నిలిచేవారు గురువులు. ప్రతి మనిషి జీవితంలో వీరి స్థానం అనన్యం.. అసామాన్యం.తప్పటడుగుల్లో.. తప్పుటడుగుల్లోపయనించవద్దని.. నింగికి నిచ్చెలేసి..ఆకాశమే హద్దుగా.. ఆశలు.. ఆశయాలేసరిహద్దుగా మనల్ని తీర్చిదిద్దేది గురువులే. విద్యాబుద్ధులతో పాటు సరైన మార్గాన్నినిర్దేశించేదీ వారే. అలాంటి ఆచార్యులను మనసారా తల్చుకుంటున్నారు కొందరు ప్రముఖులు. నేడు గురువులను స్మరించుకునే రోజు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ మనోగతాలను ఇలా వెలిబుచ్చారు. 

అమ్మ గుర్తుకు వస్తే కన్నీరే..  
మా అమ్మే నా గురువు. ఆమె ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌. నేను చదివిన స్కూల్, కాలేజ్‌ రెండూ ఒకే బిల్డింగ్‌లో ఉండేవి. ఒకరోజు నేను ఐదు నిమిషాల ఆలస్యంగా క్లాస్‌కి వెళ్లాను. అప్పుడు మా అమ్మ నన్ను గమనించింది. ఇంటికి వెళ్లాకా మమ్మీ.. సారీ ఫైవ్‌ మినిట్స్‌ లేట్‌గా క్లాస్‌కి వెళ్లాను అని చెప్పాను. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ‘చూడు నాన్నా.. చిన్నప్పటి నుంచి సమయం విలువ తెలియాలి. జీవితంలో మనకు సమయం ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఇకపై స్కూల్‌కి లేటుగా వెళ్లొద్దు. టైమ్‌ కమిట్‌మెంట్‌ని ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి అంటూ తన నిమురుతూ చెప్పింది. నా లైఫ్‌లో నా గురువు, నా ఫ్రెండ్, మార్గదర్శకురాలు అమ్మనే. 2017లో ఆమె చనిపోయారు. ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ చిన్నప్పటి నోట్‌బుక్స్‌ బయటకు తీస్తాను. ఆ నోట్‌బుక్స్‌లో సమయం (టైమ్‌) గురించి ఆమె రాసిన కొటేషన్స్‌ని చదువుకుంటూ స్మరించుకుంటా. – సోనూసూద్, బాలీవుడ్‌ నటుడు

సామాజిక దృక్పథాన్ని నేర్పారు
చిన్నప్పటి నుంచి నా ఉత్తమ గురువు అమ్మ శైలజ. ట్యూషన్‌ లేకుండా ఆమెనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పించారు. ఆదిలాబాద్‌లోని సెయింట్‌ పాల్స్‌ స్కూల్లో చదివేప్పుడు సిస్టర్‌ (టీచర్‌) రేణు ఉండేవారు. ఆమె నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. అన్నీ షేర్‌ చేసుకునేవారు. అంతేకాకుండా చాలా స్ట్రిక్ట్‌ కూడా. కాలేజీలో లైఫ్‌లో సెంట్‌ఆన్స్‌లో చదివేటప్పుడు లెక్చరర్‌ డాక్టర్‌ మాలిని నాకు సామాజిక దృక్పథాన్ని నేర్పించారు. నాతో సోషల్‌ వర్క్స్‌ ఎన్నో చేయించారు. తద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఆశ కలిగింది. ఐఏఎస్‌ అవ్వడానికి కూడా కొంతవరకు మోటివేట్‌ కాగలిగాను ఆ సోషల్‌ యాక్టివిటీస్‌ ద్వారా. వీటితో పాటు గురువులు నేర్పిన సామాజిక దృక్పథం వల్ల బుక్స్, ఆర్టికల్స్‌ రాశాను.      – హరిచందన దాసరి, జోనల్‌ కమిషనర్‌  

ఓపిక నేర్చుకున్నా.. టీచర్స్‌కి చాలా ఓపిక ఉంటుంది. స్కూల్లో ఎంత అల్లరి చేసినా కొట్టకుండా, తిట్టకుండా అల్లరి చేయొద్దంటూ ఓపికతో నచ్చచెబుతారు. నేను స్కూల్‌ ఏజ్‌ నుంచి ఏంబీఏ వరకు నా గురువుల నుంచి నేర్చుకున్నది అదే. ఎంబీఏలో ఉన్నప్పుడు మోడలింగ్‌ కెరీర్‌ని స్టార్ట్‌ చేశా. అప్పట్లో కాలేజీకి డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పట్లో ఎంబీఏ లెక్చరర్‌ సుప్రియ మేడం, ప్రిన్సిపాల్‌ సర్‌.. నాకు బాగా సపోర్ట్‌గా నిలిచారు. మోడలింగ్‌కు వెళ్లే ప్రతిసారీ నాకు పర్మిషన్‌ ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆరోజుల్లో నన్ను ఇలా ప్రోత్సహించబట్టే నేను ఈరోజు హీరోయిన్‌ని కాగలిగాను.  – ఈషారెబ్బా, హీరోయిన్‌ 

అమ్మే నా బెస్ట్‌ టీచర్‌
అమ్మ సంగీత వర్మ స్కూల్‌ ప్రిన్సిపాల్‌. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. టెన్త్‌ వరకు అమ్మ సమక్షంలోనే నా చదువు అంతా. ఆమె నుంచి లైఫ్‌ ఎలా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి. మనం మాట్లాడే తీరు, పద్ధతి అంతా నేర్పించారు. అమ్మ ఓ పక్క పర్సనల్‌ లైఫ్‌ మరో పక్క ప్రొఫెషనల్‌ లైఫ్‌ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేయడం చూసి పెద్ద ఫ్యాన్‌ని కూడా అయ్యాను. నన్ను మా అక్కని ఏ రోజు చదువు విషయం, ఇతర విషయాల్లో బలవంతం పెట్టలేదు. నా ఎడ్వయిజర్‌. నా మోటివేటర్‌. నా ఇన్‌స్పిరేషన్‌ అమ్మ సంగీత వర్మనే.           – రీతూవర్మ, హీరోయిన్‌  

లీడర్‌ అవుతావన్నారు
ఫస్ట్‌ డే స్కూల్‌కి వెళ్తున్నాను. వర్షం భారీగా వస్తోంది. ఆ టైంలో కురుస్తున్న భారీ వర్షానికి చాలా భయం వేసింది. కింద  పడటంతో దుస్తులన్నీ మురికి అయ్యాయి. అప్పటికే 20 నిమిషాల ఆలస్యమైంది. లోపల తెలియని భయం. స్కూల్‌లోకి వెళ్లగానే కొండారెడ్డి (హెడ్‌మాస్టర్‌) సార్‌ నన్ను ఎత్తుకుని క్లాస్‌రూమ్‌కి తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి చాలా గట్స్‌ ఉన్నాయి. పెద్దయ్యాక లీడర్‌ అవుతుందన్నారు. గురువుల నుంచి ఎంతోనేర్చుకున్నాను.        – సుమతి ఐపీఎస్‌

దారి చూపే దీపం
చిన్నప్పుడు దిద్దిన అక్షరం.. దిద్దించిన  చేయి చిరకాలం మన ప్రవర్తనను దిద్దుతుంటుంది. గురువంటే  గతం మాత్రమే కాదు మన వర్తమానం, భవిష్యత్తు కూడా.  గురువును గౌరవించడం అంటే మన భూత భవిష్యత్‌ వర్తమానాలను గౌరవించడం. మన జీవితాన్ని గౌరవించడం. దీనిని గుర్తిస్తున్న నగరవాసులు తమ చిన్నప్పటి రోజులకు ప్రయాణం చేస్తున్నారు. టీచర్లను గుర్తు చేసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.

పదిహేనేళ్ల తర్వాత.. టీచర్లను కలిశాం...
చదువులు పూర్తయిపోయి, ఎక్కడెక్కడికో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిపోయాం. జీవితాల్లో  స్థిరపడిన  మా స్నేహితులం అందరం కలిసి ఇటీవలే మేం చదువుకున్న సూర్యాపేట జిల్లా త్రిపురవరం ఉన్నత  పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఒక రోజంతా గడిపాం. గత కాలపు స్మృతులను నెమరేసుకుంటూ మేం విద్యార్ధుల్లా మారిపోయి, టీచర్ల చేతిలో మొట్టికాయలు తిన్నాం. తిరిగి వచ్చే ముందు మనసారా టీచర్లను సన్మానించాం. ఆ సమయంలో వారిలో కనిపించిన తృప్తి, ఆనందం మాకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. మమ్మల్ని అందరినీ పేరు పేరునా పిలిచి, మేం ఏం చేస్తున్నామో అడిగి తెలుసుకుని వారు పొందిన సంతోషంమాటల్లో చెప్పలేం.  – వి.జయరామ్‌

శ్రీరామ్‌ వెంకటేష్‌కు ఉత్తమ అవార్డు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి (కంట్రోలర్‌) శ్రీరామ్‌ వెంకటేష్‌ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు.  క్యాంపస్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్న ఆయన బోధన, పరిశోధనలతో పాటు పలు పాలన పదవుల్లో చేయి తిరిగినవారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌ 1997లో ఓయూ అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. 

మరిన్ని వార్తలు