‘మహర్షి’లో బాలనటుడు మనోడే!

10 May, 2019 10:58 IST|Sakshi
బాల నటుడు చక్రి

జంగారెడ్డిగూడెంలో సినిమా చూసిన చక్రి

37 సినిమాల్లో నటించినట్లు వెల్లడి 

జంగారెడ్డిగూడెం: భవిష్యత్తులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక అని ‘మహర్షి’ చిత్రంలోని బాల నటుడు చక్రి తెలిపాడు. మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో బాల నటుడిగా నటించిన 9 సంవత్సరాల చక్రి గురువారం చిత్రం విడుదల సందర్భంగా స్థానిక లక్ష్మీ థియేటర్‌కు వచ్చాడు. చిత్రం చూసేందుకు వచ్చిన చక్రి కొద్ది సేపు విలేకరులతో ముచ్చటించాడు. తానిప్పటి వరకు 37 చిత్రాల్లో బాల నటుడిగా నటించినట్లు చెప్పాడు. మిర్చి, కృష్ణం వందే జగద్గురుం, ద్వారక, గుంటూరోడు, స్పీడున్నోడు, నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, మనం, రోజులు మారాయి వంటి విజయవంతమైన చిత్రాల్లో చక్రి నటించాడు.

మహర్షి చిత్రంలో మహేష్‌బాబుతో ఓ సన్నివేశంలో చక్రి

మహర్షి చిత్రంలో హీరో మహేష్‌బాబుకు సపోర్ట్‌గా ఉండే బాలనటుడిగా నటించాడు. ఈ చిత్రంలో చక్రి మూగవాని పాత్ర. తాను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నిజాం పేట శ్రద్ధ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. తన అన్న విష్ణు చరణ్‌ 8వ తరగతి చదువుతున్నాడని, తమ్ముడు కృష్ణ చరణ్‌ యూకేజీ చదువుతున్నట్లు తెలిపాడు. విశేషమేమిటంటే విష్ణు చరణ్, కృష్ణ చరణ్‌లు బాలనటులే. విష్ణుచరణ్‌ 20 చిత్రాల్లో నటిం చాడని, కృష్ణచరణ్‌ రెండు చిత్రాల్లో నటించి నట్లు చెప్పాడు. జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్టపై తన అత్త, మామయ్యలు లక్ష్మి, ప్రశాంత్‌లు ఉంటున్నారని అక్కడికి వచ్చిన ట్లు తెలిపాడు. తన తండ్రి సతీష్‌ నాయుడు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని స్టిల్‌ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారని, తన తల్లి ధనశ్రీ గృహిణి అని తెలిపాడు. తన తండ్రి సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకాగా, తల్లిది ద్వారకాతిరుమల అని వివరించాడు.   
 

మరిన్ని వార్తలు