ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను: చిన్మయి తల్లి

12 Oct, 2018 11:03 IST|Sakshi

నాపై కక్ష సాధింపులు జరగవచ్చు అంటోంది గాయనీ చిన్మయి. ఆమె ఇటీవల ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలను గుప్పించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో వైరముత్తు అసలు రూపం ఇదా? అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆయన సానుభూతిపరులు అవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపారేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ కూడా చిన్మయి ఆరోపణలను కొట్టి పారేయలేమని, ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఇక చిన్మయి ధైర్యాన్ని పలువురు సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఆమె లైంగిక వేధింపుల రాకెట్‌ను బట్టబయలు చేయడానికి కారణం ఏమిటీ అన్న విషయాన్ని బుధవారం ఒక ఆంగ్ల టీవీ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో వెల్లడించారు.

ఆ వివరాలు.. గీతరచయిత వైరముత్తు నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆ సంఘటనను ఎదుర్కొన్నాను. అదే కార్యక్రమంలో పాల్గొన్న వైరముత్తు అనంతరం నన్ను ఆయన హోటల్‌ గదికి రమ్మని పిలిచారు. అందుకు నేను నిరాకరించాను. ఆ సమయంలో చాలా భయపడ్డాను కూడా. ఆ సమయంలో వైరముత్తు మరో ఇద్దరు అమ్మాయిలను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నాలా వేధింపులకు గురైన వారు ఇప్పటికైనా బహిరంగంగా బయట పెడతారనుకుంటున్నాను. వైరముత్తు అధికార బలంతో వారంతా బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. అయితే ఇది సరైన సమయం. బా«ధితులు తమ వేదనను వ్యక్తం చేయాలని కోరారు.

వైరముత్తుకు సహకరించాలన్నారు..
చిన్మయి ఆరోపణలకు స్పందించిన వైరముత్తు పేరున్న వారిపై అలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయిందని, నిజాల్ని కాలమే బట్టబయలు చేస్తుందని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి చిన్మయి కౌంటర్‌ ఇస్తూ వైరముత్తు అబద్ధం చెబుతున్నారన్నారు. చిన్మయితో పాటు టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తల్లి పద్మాసిని కూడా తన కూతురును వైరముత్తు లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఆమె ఏమన్నారో చూద్దాం.

‘వైరముత్తు చిన్మయిని లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం ముందుగా తెలిసింది నాకే. 2004లో ఒక సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం కోసం స్విట్జర్లాడ్‌కు వెళ్లాం. కార్యక్రమం పూర్తి కాగానే నిర్వాహకులు అందరిని తిరిగి పంపించేస్తున్నారు. మమల్ని మాత్రం అక్కడే ఉండమన్నారు. అక్కడ వైరముత్తు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అమ్మా మీరు ఇక్కడే వేచి ఉండండి. చిన్మయి కోసం వైరముత్తు హోటల్‌ రూమ్‌లో వెయిట్‌ చేస్తున్నారు ఆమెను రమ్మన్నారు అని చెప్పాడు. హోటల్‌కు చిన్మయి ఎందుకు ఒంటరిగా వెళ్లాలి. ఏదైనా వృత్తి పరమైన విషయాలు మాట్లాడాలంటే ఊరికు వెళ్లిన తరువాత చూసుకోవచ్చు. ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను. అందుకు అతను వైరముత్తుకు కాస్త సహకరించండి అని బహిరంగంగానే అన్నాడు. అందుకు వేరేవారిని చూసుకోండి అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేశాం. మీటూ సంఘానికి చిన్మయి మద్దతుగా నిలిచారు. ఇది మహా సంఘంగా మారాలి. ఇప్పుడిప్పుడే అందరూ దీని గురించి మాట్లడటం మొదలెట్టారు. పాడైపోతున్న ఈ సమాజానికి అవగాహన కలగాలి’ అని అన్నారు.

ప్రచారం కోసం కాదు: చిన్మయి
ప్రచారం కోసం నేను ఇదంతా చెప్పడం లేదు. నాకు ఇకపై పాటలు పాడే అవకాశాలు వస్తాయా? అన్నది తెలియదు. రాజకీయ పరమైన ఒత్తిళ్లు రావచ్చు. అయితే ఇలాంటి వాటి గురించి ఎవరో ఒకరు బయట పెట్టాల్సిందే అని చిన్మయి అన్నారు. 

మహిళలు మారాలి: లక్ష్మీ రామకృష్ణన్‌
పెరంబూరు: ముందుగా మహళలు మారాలి అని అన్నారు సినీ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌. సినీరంగంలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం విశ్వరూపం దాల్చిన విషయం తెలిసిందే. మీటూ పేరుతో ఒక సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుని అత్యాచార బాధితులందరూ తమకు జరిగిన వేధింపుల గురించి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల గీత రచయిత వైరయుత్తుపై గాయనీ చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి ట్విట్టర్‌లో  స్పందించిన నటి లక్ష్మీరామకృష్ణన్‌ లైంగిక వేధింపుల వ్యవహారంలో చిత్రపరిశ్రమనే తప్పు పట్టడం సరికాదన్నారు. మార్పు కావాలంటే ఏ విషయంలోనైనా అందుకు మనం కట్టుబడి ఉండాలన్నారు. అడ్జెస్ట్‌ అయ్యే వారు అందుకు కారణం అయ్యే మహిళలు ముందు మారాలన్నారు. మన ఆత్మగౌరవం, మర్యాద కంటే ఉన్నతమైనద ఏదీ లేదని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు