ఇలాంటి వాళ్లకి ఎలా బుద్ధి చెప్పాలి?

3 Nov, 2023 00:11 IST|Sakshi

పారా హుషార్‌

బెంగళూరులోని ప్రముఖ మాల్‌. ఒక పెద్దమనిషి చాలా సేపుగా దేనికో కాచుకుని ఉన్నాడు. ఒక మహిళను గమనించాడు. వెనుక నుంచి వచ్చి ఆమెను అసభ్యంగా తాకి జనంలో కలిసిపోయాడు. కాని ఇది ఎవరో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. బెంగళూరు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రంగంలో దిగారు. రద్దీ ప్రదేశాల్లో స్త్రీలను అసభ్యంగా తాకడం కొందరికి అలవాటు. వీరితో ఎలా అప్రమత్తంగా ఉండాలి? వీరు మన ఇంటి మగవారే అయితే ఏ విధంగా సంస్కరించాలి?

మొన్నటి ఆదివారం జరిగింది ఇది: బెంగళూరులోని ఒక భారీ మాల్‌లో తన కుటుంబంతో షాపింగ్‌ చేస్తున్న జయప్రకాష్‌ (30)కి అతని చెల్లెలు దూరంగా ఉన్న ఒక వ్యక్తిని చూపింది. అన్నయ్యా... అతను ఆడవాళ్లను తాకుతున్నాడు అని చెప్పింది. జయప్రకాష్‌ పెద్దగా పట్టించుకోలేదు కాని కాసేపు ఆ వ్యక్తినే గమనిస్తే అతడు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను తాకుతున్నాడని అర్థమైంది. మాల్‌ రద్దీగా ఉండటంతో అతడు తాకుతున్నా ఆడవాళ్లు ఏదో యాదృచ్చికంగా తగిలాడు అన్నట్టుగా ముందుకు కదిలిపోతున్నారు.

జయప్రకాష్‌ వెంటనే తన కెమెరాతో ఆ వ్యక్తి చర్యను రికార్డు చేశాడు. మాల్‌ వారికి కంప్లయింట్‌ చేశాడు. అంతేకాదు, సోషల్‌ మీడియాలో పెట్టాడు. అంతే! ఆ వీడియో దావానలంలా వ్యాపించింది. మాల్‌ వాళ్లిచ్చిన కంప్లయింట్‌ ఆధారంగా ఐపిసి సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతణ్ణి సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి బెంగళూరుకు చెందిన ఒక రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌. 8 నెలల క్రితమే రిటైర్‌ అయ్యాడు. వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు రావడం కంటే ముందే అతను కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు. అయినా పోలీసులు వెతుకుతున్నారు.

ఒక ‘చిన్న దుశ్చర్య’– దారుణ ఫలితం: ఆడవాళ్లను పబ్లిక్‌ ప్లేసుల్లో అసభ్యంగా కొన్ని సెకన్లపాటు తాకడం పెద్ద తప్పేం కాదని మగవారనుకుంటారు. ఇది ‘అత్యాచారం’ కాదు కదా. బలవంతం చేయడం కాదు కదా... వారికి తెలిసే లోపల తాకి వెళ్లిపోతాం కదా అనుకుంటారు. కాని ఆ సెకన్ల చర్య కూడా స్త్రీలకు తెలుస్తుంది. వికారం కలిగిస్తుంది. ఇప్పుడు ఈ రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ చేసిన చర్య బయట పడటంతో అతని పరువు, మర్యాదలు గంగలో కలిశాయి. కన్నడ టీవీ చానెళ్లు అతడి ఫొటో పెట్టి బజారుకు ఈడ్చాయి. పోలీసు కేసు నిరూపితమైతే శిక్ష కూడా పడుతుంది. బహుశా అతనికి ఎదిగొచ్చిన పిల్లలు, కొడుకు, కోడలు, కూతురు... వీరంతా ఉంటే వారి కుటుంబాలు కూడా మాటలు పడాలి. ఇవన్నీ మగవారు ఎందుకు ఆలోచించరు?

మ్యాన్‌ టచింగ్‌: ఇలా ఆడవాళ్లను పబ్లిక్‌ ప్లేసుల్లో తాకడాన్ని‘మ్యాన్‌టచింగ్‌’ అని కొందరు అంటారు. ఒక స్త్రీ శరీరం అందుబాటులోకి వస్తే దానిని తాకొచ్చనే గుంపులో గోవింద స్వభావం మగవాణ్ణి ఇందుకు ఉసిగొల్పుతుంది. లైంగిక అభద్రతలు కొందరిని ఇలా చేయడానికి ప్రేరేపిస్తే, లైంగిక ఉద్రేకం కోసం కొందరు ఇలా చేస్తారు. గమనించాల్సిందేమంటే ఈ మగవారంతా మిగతా సమయాల్లో ‘పరువు, మర్యాద, మంచి ఉద్యోగం’ ఉన్న వ్యక్తులే. అపరిచితులు, పరిచితులు కూడా ఇలా చేస్తారు. ఎవరూ గమనించకుండా శరీర భాగాలు తాకేవారు కొందరైతే, వేదికల మీద పెళ్లిళ్లు, శుభకార్యాలలో పెద్దరికం వహిస్తూ బుగ్గలు పుణకడం, భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోవడం మరికొందరు చేస్తారు. ఇవన్నీ స్త్రీల అనుమతి లేకుండా వారిని తాకడంగానే భావించాలి.

మగవాళ్లు దొంగసాకులు:
1. కొంచెమలా రాసుకుంటే ఏమవుతుంది అనుకోవడం... ఆమె మరీ రెచ్చగొట్టేలా ఉంది అనడం.
2. ఆమె నన్ను రెచ్చగొట్టి తాకేలా చేసింది అనడం
3. పరిచయం ఉన్న ఆమేగా... ఏమనుకుంటుందిలే అనుకోవడం
4. ఆమె పట్ల నా ఇష్టాన్ని తెలిపేందుకు అనడం... ఇలా ఏం చెప్పినా ఒక స్త్రీని ఆమె అనుమతి లేకుండా ఎక్కడా తాకకూడదు.

నిలువరించాలి: స్త్రీలు బహిరంగ ప్రదేశాలలో ‘ఎందుకులే రచ్చ’ అనుకోకుండా ఇలా అసభ్యంగా తాకే వారిని వెంటనే నిలువరించాలి. చూపు ద్వారా, మాట ద్వారా వీరిని ఒక్క క్షణంలో నిలువరించవచ్చు. సాయం తీసుకుని పోలీసులకు పట్టివ్వొచ్చు. పరిచితులు అస్తమానం తాకుతూ ఉన్నా వారికి మొహమాటం లేకుండా తాకొద్దని చెప్పేయాలి. ముఖ్యంగా పిల్లలకు పబ్లిక్‌ ప్లేసుల్లో ఎవరినీ తాకనీకుండా చూసుకోవాలని హెచ్చరించాలి.

మన ఇంటి మగవారు: పై కేసులోని రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌కు కూడా ఒక ఇల్లు ఉంటుంది. ఇలా ఆడవాళ్లను తాకాలని చూసే మగవారు ఏ ఇంటిలో అయినా ఉండొచ్చు. ఇంటి ఆడవాళ్లు మాటల్లో మాటగా ఎవరైనా పబ్లిక్‌ ప్లేసుల్లో తమను తాకితే ఎంత కంపరంగా ఉంటుందో చెబుతుండాలి. అలా చేసిన వారిని పబ్లిక్‌గా పట్టుకొని దండిస్తే ఎంత అవమానంగా ఉంటుందో చెప్పాలి. స్త్రీలను గౌరవించి వారికి అసౌకర్యం కలిగించే ఏ పనీ చేయరాదని తప్పక చెప్పాలి. అలాగే సామాజిక ఆరోగ్యం కోసం మగవారు తమ చపలత్వాన్ని నివారించుకోవడం తప్పక అభ్యాసం చేయాలి– దొరికి దెబ్బలు తినడం కంటే అదే మేలు.

మరిన్ని వార్తలు