శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి –సుబ్బరామిరెడ్డి

5 Mar, 2018 00:50 IST|Sakshi

‘‘అందరూ జన్మిస్తారు. జీవిస్తారు. మరణిస్తారు. కొంత మంది మరణించినా శాశ్వతంగా గుండెలో ఎప్పూడు చెరగని ముద్ర వేసి జీవిస్తారు. అలాంటి కోవకు చెందిన మనిషి శ్రీదేవి’’ అన్నారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ప్రముఖ సినీతార శ్రీదేవి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ–‘‘ భారతదేశ చలనచిత్రరంగంలో శ్రీదేవి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. హిందీలో చాందినీగా ఆకట్టుకున్నారు. ఆవిడ మరణవార్త విని దేశం మొత్తం షాక్‌ అయ్యింది. ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. శ్రీదేవితో మా అమ్మాయి పింకీ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేది. శ్రీదేవి ఎంత పెద్ద ఆర్టిస్టో అంత మంచి హ్యూమన్‌ బీయింగ్‌. ఎంత ఎత్తు ఎదిగినా రూట్స్‌ని మరిచిపోలేదు. అంత గొప్ప నటి, శక్తి స్వరూపిణి దూరమైయేసరికి కోట్లాది అభిమానులు తమ అభిమానాన్ని, దుఃఖాన్ని చూపించారు. బోనీ కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు వాళ్లు విడిగా వచ్చేవారు కాదు.

శ్రీదేవి మరోజన్మలోను శ్రీదేవిలానే పుట్టాలి. తెలుగమ్మాయిగానే పుట్టాలి. మా శ్రీదేవి మళ్లీ వచ్చిందనుకోవాలి’’ అన్నారు. ప్రముఖ గాయని సుశీల మాట్లాడుతూ–‘‘ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య శ్రీదేవి. మనల్ని మైమరపించి మళ్లీ తన లోకానికే వెళ్లిపోయింది. 8 ఏళ్ల వయసులో శ్రీదేవికి పాట పాడాను. అంతేకాదు ఆమె మొట్టమొదటి సినిమాకు కూడా పాట పాడాను. మనకు ఎన్నో తీపిగుర్తులను మిగిల్చి తను వెళ్లిపోయింది’’ అన్నారు.‘‘శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె నిగర్విగా ఉండేది’’ అన్నారు నటుడు కోటశ్రీనివాసరావు.

‘‘శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడూ సార్‌ అని పిలిచేది. ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం. ఇప్పుడు ఆమె లేదు అంటే నమ్మబుద్ది కావడం లేదు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. ఆమె మరణించినా..సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారామె’’ అని అన్నారు కృష్ణంరాజు. ‘‘ శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత ఎంతో దుఃఖించాను. తెలుగు అమ్మాయిగా ఎంతో సాధించింది. జీవితంలోని ప్రతి అడుగును ఒక లక్ష్యంగా చేసుకుని నడిచింది.

ప్రతి పాత్రను ఒక సవాలుగా తీసుకునేది శ్రీదేవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారు శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాదు. మంచి మాతృమూర్తి కూడా. తనలాగే జాన్వీని కూడా తీర్చిదిద్దాలని అనుకున్నారు. జాన్వీ మంచి నటిగా రాణించాలని కోరుకుంటున్నాను’’అన్నారు నటి జయప్రద. ‘‘శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను. శ్రీదేవి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మరిచిపోలేక పోతున్నాను.

జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు నటి జయసుధ. ‘‘శ్రీదేవితో కలిసి నటించలేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమెతో ఓ సినిమాలో నటించే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలే. ముంబైలో జరిగిన శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లాలి అనుకున్నాను. కానీ..కుదర్లేదు. ఇప్పుడు సంస్మరణసభలో పాల్గొనే అవకాశం వచ్చింది’’ అన్నారు హీరో రాజశేఖర్‌. ‘‘1972లో ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవిని చూసిన మొదటి రోజే గొప్ప నటి అవుతుందని అనుకున్నాను. రామానాయుడు ఆమెను

‘దేవత’ను చేస్తే..ఎన్టీఆర్‌ ఆమెను ‘అనురాగదేవత’ను చేశారు’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘శ్రీదేవి సెట్‌లో ఎవర్ని బాధపెట్టలేదు. కానీ చనిపోయి అందర్నీ నొప్పించింది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. ‘‘శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి నటన చూసి, గొప్ప నటి అవుతుందనుకున్నాను’’ అన్నారు నటుడు బాబుమోహన్‌. ‘‘శ్రీదేవితో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీదేవితో నటించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నాను. శ్రీదేవి లాంటి హీరోయిన్‌ కావాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నాను’’ అన్నారు హీరోయిన్‌ నివేధా థామస్‌. రేలంగి నరసింహరావు, అమల, శ్రీకాంత్, అల్లు అరవింద్, జగపతిబాబు, సుమంత్, ఆలీ, శివాజీ రాజా, నరేశ్, ఉపాసన కామినేని తదితరులు పాల్గొన్నారు.


(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు