వివాదాల 'దర్బార్‌'

12 Jan, 2020 08:00 IST|Sakshi

దర్బార్‌ చిత్రం చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం దర్బార్‌. నయనతార నాయకిగా, నటి నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి టాక్‌ రకరకాలుగా వస్తున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. దర్బార్‌ చిత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వివాదాల చుట్టూ తిరుగుతోంది. దర్శకుడు మురుగదాస్‌ చిత్రంలో రాజకీయాలు లేవంటూనే వివాదాస్పద సన్నివేశాలను జొప్పించి చర్చనీయాంవయానికి దారితీశారు.

చదవండి: నితిన్‌ ఈజ్‌ బ్యాక్‌ అనేలా భీష్మ టీజర్‌

 రజనీకాంత్‌పై కోర్టులో పిటిషన్‌ 
దర్బార్‌ చిత్ర వ్యవహారం నటుడు రజనీకాంత్‌పై కోర్టులో పిటిషన్‌ వరకూ దారితీసింది. ఈ చిత్రంలో పోలీసు అధికారులను కించపరచే విధంగా సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ తూత్తుక్కుడికి చెందిన మాజీ రక్షణదళ అధికారి మరియమైఖెల్‌ శుక్రవారం తూత్తుక్కుడి 3వ మేజిస్టేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో దర్బార్‌ చిత్రంలో యూనిఫామ్‌ సర్వీసర్ల(డిపార్ట్‌మెంట్‌)ను కించపరచేవిధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయన్నారు. చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించిన నటుడు రజనీకాంత్‌ హిప్పీ జుత్తు, గడ్డంతో నటించడంతో పాటు నేను పోలీస్‌ కమిషనర్‌ను కాదు రౌడీని అని మాట్లాడతారన్నారు. ఇవి పోలీసులను, సైనికులను కించపరచేవిగా ఉన్నాయన్నారు. దర్బార్‌ చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించిన నటుడు రజనీకాంత్, దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, నిర్మాణ సంస్థలపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 21వ తేదీన రానుంది.

కాగా మరో ఐఏఎస్‌ అధికారి అలెక్స్‌పాల్‌మీనన్‌ దర్బార్‌ చిత్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిత్రంలో పోలీస్‌ అధికారి రజనీకాంత్‌ను నాలుగు రోజుల్లో ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని ఆయన ఆర్డర్‌ వేస్తారు. రజనీకాంత్‌ కూడా కసరత్తులు చేసి తన పిట్‌నెస్‌ను నిరూపించుకుని తన అధికారాన్ని కాపాడుకుంటారు. దీన్ని ఎగతాళి చేసే విధంగా ఐఏఎస్‌ అధికారి అలెక్స్‌పాల్‌ మీనన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ నాలుగు రోజుల్లో తలైవర్‌ ఫిట్నెస్‌ను నిరూపింపజేసింది. తాన్యా చాలాగొప్ప హ్యూమన్‌ రైట్‌ వైలేషన్‌ అని అన్నారు. అదేవిధంగా దర్బార్‌ చిత్రం పేరును ప్రస్థావించకుండా అయ్యా, రేయ్‌ తమిళ దర్శకులా ఇకపై ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల నేపథ్యంతో చిత్రాలు చేయకండి, మీ లాజిక్‌తో మా మెదడు అంతా మొద్దుమారిపోయ్యింది అని పేర్కొన్నారు. ఇప్పుడీయన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
 
పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు 
దర్బార్‌ చిత్రం విడుదలైన రోజునే పైరసీ వచ్చేసింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అంతేకాకుండా చిత్రంలోని చర్చనీయాంశ సన్నివేశాలను కొందరు వాట్సాప్‌లో పోస్ట్‌ చేయడంతో పాటు దర్బార్‌ చిత్రాన్ని యూడు బిట్లుగా పూర్తి చిత్రాన్ని వాటాప్స్‌లో పోస్ట్‌ చేస్తామని, కాబట్టి ఎవరూ చిత్రాన్ని థియేటర్లకు వెళ్లి చూడవద్దు అని ప్రచారం జరుగుతోంది. దర్బర్‌ చిత్ర నిర్వాహకులు శనివారం చెన్నైలోని పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఈ వాట్సాప్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దర్బార్‌ చిత్రంపై కొందరు కుట్రపన్ని వసూళ్లను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాట్సాప్‌లో దుష్ప్రచారం చేసే వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఆ సన్నివేశాలను తొలగించారు 
దర్బార్‌ చిత్రంలో చోటు చేసుకున్న వివాదాస్పద సంభాషణలు, సన్నివేశాలపై విమర్శనల వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్రంలో డబ్బు ఉంటే జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్‌ చేసి రావచ్చు అన్న సంభాషణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. జయలలిత స్నేహితురాలు శశికళను ఉద్దేశించే ఆ సంభాషణలను పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు. ఆ సంభాషణలను వినోదం కోసమే పొందుపరచినట్లు, ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు ఆ సంభాషణలు ఎవరినైనా బాధించినట్‌లైతే వాటిని చిత్రం నుంచి తొలగించడానికి సిద్ధమన్నారు. ఆ తరువాత వాటిని తొలగించారు కూడా.  

మరిన్ని వార్తలు