కళ్యాణ్‌రామ్‌కి సరిపోయే టైటిల్‌ ఇది

22 Dec, 2019 01:29 IST|Sakshi
entha manchi vadavu ra press meet

– సతీష్‌ వేగేశ్న

‘‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్‌ మార్క్స్‌ అన్నాడు. కానీ మానవ సంబంధాలు హార్దిక సంబంధాలుగా ఉండాలి’’ అని దర్శకుడు సతీష్‌ వేగేశ్న అన్నారు. కళ్యాణ్‌ రామ్, మెహరీన్‌ జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్‌ అధినేత ఉమేష్‌ గుప్తా నిర్మించారు. జనవరి 15న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ – ‘‘ఎంత మంచి వాడవురా’ నా మనసుకి దగ్గరైన సినిమా. జనవరి మొదటివారంలో ప్రీ–రిలీజ్‌ వేడుకను ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ‘‘సంక్రాంతి రైతుల పండగ. అలాగే సంక్రాంతి సినిమావాళ్ల పండగ కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల మధ్య సత్సంబంధాలు తగ్గిపోతున్నాయి.

వాటి గురించి ఈ సినిమాలో బాగా చర్చించారు దర్శకుడు. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇది బెంచ్‌మార్క్‌ సినిమా అవుతుంది’’ అన్నారు నరేశ్‌. ‘‘ఈ టైటిల్‌ పెట్టగానే అందరూ బావుంది అన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ‘కళ్యాణ్‌రామ్‌కి పర్ఫెక్ట్‌ టైటిల్‌’ అన్నారు. ఆయన అందరితో చాలా బావుంటారు. నిర్మాతలు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. కళ్యాణ్‌రామ్‌గారి గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా పాయింట్‌ను ఓ గుజరాతీ సినిమా నుంచి తీసుకున్నాం’’ అన్నారు సతీష్‌ వేగేశ్న. ‘‘సతీష్‌గారు కథ చెప్పగానే మాటలురాలేదు. ఈ కథ అందర్నీ కదిలిస్తుంది. ఈ సినిమా టీమ్‌ అందరూ మంచివాళ్లే’’ అన్నారు మెహరీన్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గోపీసుందర్, శివలెంక కృష్ణప్రసాద్, ఉమేష్‌ గుప్తా, చిత్రబృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు