సినీ రచయితపై కేసు

21 Nov, 2017 20:35 IST|Sakshi

జైపూర్: ‘పద్మావతి’ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. ఈ సినిమాకు మద్దతు ప్రకటించిన  సీనియర్‌ రచయిత జావేద్ అక్తర్‌పై జైపూర్‌లో కేసు నమోదయింది. రాజ్‌పూత్‌లను అవమానించారనే ఆరోపణలతో సింధి క్యాంప్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గత 200 ఏళ్ల చరిత్రలో రాజ్‌పూత్‌లు ఎప్పుడూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదని వ్యాఖ్యానించడంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పద్మావతి సినిమా వివాదంపై జావేద్‌ అక్తర్‌ స్పందిస్తూ... ‘రాజ్‌పూత్‌లు, రాజ్‌వాడాలు ఎప్పుడు కూడా బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా, సినిమా రూపకర్తపై వీధి పోరాటాలు చేస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ రాణాలు, రాజులు, మహరాజులు 200 ఏళ్లు బ్రిటీషు కోర్టుల్లో పనిచేశారు. రాజ్‌పూత్‌ల గౌరవం, ప్రతిష్ట అప్పుడేమయింద’ని ప్రశ్నించారు. పద్మావతి సినిమాను నిషేధించాలని ఆందోళనలు చేస్తున్నవారిపై కూడా ఆయన విమర్శలు చేశారు. బ్రిటీషర్లను రాజ్‌పూత్‌లు ఎదిరించలేదన్న జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనను రాజస్థాన్‌లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు