నవ్వులతో థియేటర్‌ నిండిపోతుంది

13 Aug, 2018 13:09 IST|Sakshi
హీరోయిన్‌ రష్మిక ,హీరో విజయ్

గీత గోవిందం హీరో విజయ్‌ దేవరకొండ

అగ్ర హీరోగా విజయ్‌ ఎదుగుతాడు: అల్లు అరవింద్‌

ఏయూ కాన్వొకేషన్‌ హాలులో చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అగ్ర హీరోల సరసన నిలబడే సత్తా ఉన్న హీరో విజయ్‌ దేవరకొండ అని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. విజయ్‌ ఐదు, పది సినిమాలతో వెళ్లే రకం కాదన్న ఆయన వంద సినిమాలను కచ్చితంగా చేస్తాడని.. ఆ పట్టుదల ఆయనలో కనిపిస్తుందన్నారు. ఏయూలోని కాన్వొకేషన్‌ హాల్‌లో ఆదివారం గీత గోవిందం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తమ బ్యానర్‌లో దర్శకుడు పరుశరాం రెండు సినిమాలు చేశారని, మూడో సినిమా కూడా చేయబోతున్నట్టు వెల్లడించారు. గీత గోవిందం సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు లీకైయ్యాయని, అందుకు కారణమైన 17 మంది విద్యార్థులు అరెస్టు అయ్యారని చెప్పారు. మా సినిమాతో పాటు రాబోయే మూడు పెద్ద సినిమాలకు సంబంధించిన సీన్లు వారి వద్ద ఉన్నాయన్నారు. అదే మమ్మల్ని ఆందోళనకు గురి చేసిందన్నారు. గీత గోవిందం సినిమా కుటుంబంతో సహా చూసి ఆనందించాలని కోరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నానికి సినిమా పరిశ్రమ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ చాలా కాలం సినీ పరిశ్రమలో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనుకున్నది సాధించి తీరుతా..
ఎంత మంది ఎన్ని రకాలుగా తన ఎదుగుదలను అడ్డుకోవాలని చూసినా.. తాను అనుకున్నది సాధిస్తానని హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు. తనను తొక్కాలని సినిమాలను లీక్‌ చేయడం, తనపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఓ సినిమా చేయడానికి ఎంతో మంది ఎన్నో రోజులు కష్టపడతారని, అవేమి దృష్టిలో పెట్టుకోకుండా సినిమాకు నష్టం కలిగించే పనులు చేయడం దారుణమన్నారు. మూడు రోజులుగా మనసులో చాలా బాధగా ఉందని, ఉత్సాహం మొత్తం నీరుగారిపోయిందని కంటతడి పెట్టారు. అసలు ఈ రోజు ఫంక్షన్‌లో ఏమీ మాట్లాడకూడదని అనుకున్నానని, ఇక్కడికి వచ్చిన తరువాత తనలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. గీత గోవిందం సినిమా చూసినంతా సేపు నవ్వుకునే ఉంటారని, నవ్వులతో థియేటర్‌ నిండిపోతుందని అన్నారు. అనంతరం హీరోయిన్‌ రష్మిక తనకు చిత్ర యూనిట్‌తో కలిíసి డ్యాన్స్‌ చేయాలని కోరడంతో.. హీరో విజయ్, డైరెక్టర్‌ పరుశురాం, అల్లు అరవింద్‌లు వేదికపై డ్యాన్స్‌లతో అలరించారు. కాగా.. కార్యక్రమ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురయ్యారు. స్థానిక కళాకారులు నిర్వాహకుల తీరుతో అసంతృప్తికి లోనయ్యారు.  

మరిన్ని వార్తలు