స్టార్ట్‌ కెమెరా అనలేకపోయా– గొల్లపూడి మారుతీరావు

14 Nov, 2017 05:08 IST|Sakshi

‘‘యాభై మూడేళ్ల కిందట మంచి కథ, సినిమాకి మేం ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. డబ్బులొస్తాయా? రావా అనే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు సినిమా సక్సెస్‌ అవుతుందా? డబ్బులొస్తాయా? రావా? అనే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అన్నారు నటులు గొల్లపూడి మారుతీరావు. కార్తికేయ, సిమ్రత్‌ జంటగా రిషి దర్శకత్వంలో రవీందర్‌ ఆర్‌. గుమ్మకొండ నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తీక్‌’లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా గొల్లపూడి మాట్లాడారు. ‘‘నేను రెగ్యులర్‌గానే సినిమాలు చేస్తున్నా. కాకపోతే నా వయసుకి తగ్గట్టు ఎక్కువ సినిమాలు చేయడం లేదంతే.

ప్రస్తుత సినిమాల్లో నాకు తగ్గ పాత్ర ఉంటేనే అవకాశం ఇస్తున్నారు. ‘ఈ మధ్య కాలంలో కథలు చెప్పకపోయినా ఫర్వాలేదులే’ అనేంత మంచి సినిమాలొస్తున్నాయి. అంటే విమర్శించడం లేదు. ప్రేక్షకులకు ఏం చూపిస్తే హ్యాపీగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ‘ప్రేమతో మీ కార్తీక్‌’ మూడు తరాలకు చెందిన చక్కని కుటుంబ కథా చిత్రమిది. అమెరికాలో ఎంతో సంపాదించిన హీరో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అతనేం చేశాడన్నది ఆసక్తికరం. కొత్త దర్శకులు, నిర్మాతలు వచ్చినప్పుడు సరికొత్త ఆలోచనలు, కొత్త సినిమాలొస్తాయి. డిజిటల్‌ రంగాన్ని నేటి తరం బాగా వినియోగించుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం ‘బాహుబలి’ని ఊహించలేం’’ అన్నారు.

నా దర్శకత్వం ఓ గొప్ప విషాదానికి గుర్తు
సక్సెస్‌ఫుల్‌ రైటర్‌ అయిన మీరు ఎందుకు దర్శకత్వం చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నా జీవితంలో దర్శకత్వం అన్నది ఓ గొప్ప విషాదానికి గుర్తు. మా అబ్బాయి ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తు 9వ రోజే చనిపోయాడు. ఆ సమయంలో ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు నేను చేపట్టి ఫస్ట్‌ టైమ్‌ ‘స్టార్ట్‌ కెమెరా’ అన్నాను. ఆర్నెల్లకు షూటింగ్‌ పూర్తయింది. చివరిరోజు షూటింగ్‌లో ‘స్టార్ట్‌ కెమెరా’ అనలేకపోయా. కారణం కొడుకు చనిపోయాడనే బాధ. అప్పటి నుంచి దర్శకత్వం ఆలోచనే లేదు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌ అశోక్‌రెడ్డి గుమ్మడికొండ, సంగీతం: షాన్‌ రెహమాన్, సమర్పణ: రమణ శ్రీ గుమ్మకొండ, గీతా మన్నం.

మరిన్ని వార్తలు