హార్మోని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌

16 Aug, 2018 07:50 IST|Sakshi
హార్మోని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత ఆల్బం ఆవిష్కరణ దృశ్యం

పెరంబూరు: సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ చేయి మీటితే చాలు సంగీత వాయిద్యాలు సంగతులు పలుకుతాయి. ఆయన సంగీతంలో ఎలాంటి గీతం అయినా అమృత రాగంగా మారుతుంది. నిత్య ప్రయోగసృష్టి కర్త, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌రెహ్మాన్‌. ఈయన తాజాగా చేసిని మరో అద్భుత ప్రయోగం హర్మోని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌. దర్శక శిఖరం, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, కవితాలయ సంస్థ వ్వవస్థాపకుడు, దివంగత దర్శక దిగ్గజం కే.బాలచందర్‌కు మానసపుత్రుడు ఏఆర్‌ రెహ్మాన్‌ అని చెప్పవచ్చు. ఆ సంస్థ నిర్మించిన రోజా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇంతింతై వటుడింతైన సామెత మాదిరి ప్రపంచ సంగీతం గర్వించే స్థాయికి ఎదిగారు.

తాజాగా కమితా లయా సంస్థ ఆధ్వర్యంలో హార్మోని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ అనే సంగీత ఆల్బంను రూపొందించారు. ఆయన ఒక స్టూడియోలో కూర్చుని ఆల్బంకి సంగీత బాణీలు కట్టలేదు. అసలు ఇది సాదాసీదా సంగీత ఆల్బం కాదు. దేశంలోని పలు రాష్ట్రాల సంప్రదాయాలు, సంస్కృతుల సమ్మేళనంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి, ప్రకృతిని ఆస్వాదిస్తూ బాణీలు కట్టి రూపొందించిన ఆల్బం హార్మోణి విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌. ఐదు భాగాలుగా రూపొం దించిన ఆల్బంలో కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లోని అందమైన ప్రకృతి భావాలు, సంగీత కళాకారుల అనుభవాలు, వారి సంప్రదాయ సంగీతాలను రస రమ్యంగా ఆవిష్కరించారు. ఆయా రాష్ట్రసంగీత కళాకారులు ఎలా కష్టపడి పైకొచ్చారు? సొంతంగా సంగీత వాయిద్యాలను తయారు చేసుకుని సంగీతంలో సాధన చేసిన వారి నిరంతర కృషి వంటి అంశాలను అద్భుతంగా పొందుపరిచారు.

21 నిమిషాల నిడివి..
ఐదో భాగంలో అన్ని సంప్రదాయ వాయిద్యాల మేలుకలయికతో 21 నిమిషాల నిడివితో రూపొందించిన గీతం అద్భుతం అనిపిస్తుంది. ఈ గీతానికి ఏఆర్‌ రెహ్మాన్‌ చెన్నైలోని వైఎం.స్టూడియోలో బాణీలు కంపోజ్‌చేశారు. ఆ సంగీత సమ్మేళనం వీనుల విందు, కనులకు కమనీయంగా ఉంటుంది. రెండు దశాబ్దాల పాటు భారతీయ సినిమాను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం కే.బాలచందర్‌ కవితాలయ సంస్థ, బుల్లితెరపైనా తన దైన ముద్ర వేసుకుంది. తాజాగా డిజిటల్‌ రంగంలోకి ప్రవేశించి హార్మోని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ అనే సంప్రదాయ సంగీతాల సమ్మేళంతో ఒక కొత్త ప్రయోగం చేసింది. ఈ ఆల్బంను మంగళవారం సాయంత్రం కమితాలయ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్, కే.బాలచందర్‌ వారసురాలు పుష్పా కందస్వామి, ఆమె జీవిత భాగస్వామి కందస్వామి భరతన్, యూనిట్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హార్మోని విత్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ సంప్రదాయ సంగీత ఆల్బంతో డిజిటల్‌ యుగంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని పుష్పా కందస్వామి పేర్కొన్నారు. కార్యక్రమంలో నటి కుష్బూ, నటుడు వివేక్‌ అతిథులుగా పాల్గొని కవితాలయ సంస్థతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సంగీత అల్బం బుధవారం నుంచి అమేజాన్‌ ప్రైమ్‌ విడియో యాప్‌లో ప్రసారం అవుతోంది.

మరిన్ని వార్తలు