'ఫూల్స్ డే' సినీ సందడి!

28 Mar, 2016 19:48 IST|Sakshi
'ఫూల్స్ డే' సినీ సందడి!

శుక్రవారాలు, పండుగలు, వేసవి సెలవులు, పబ్లిక్ హాలీడేస్ వంటి వాటినే సినిమా రిలీజ్ కు  ముహూర్తాలుగా భావించే సినీ నిర్మాతలు... ఇటీవల ఫూల్స్ డేను కూడ మంచి ముహూర్తంగా ఎంచుకున్నారు. మార్చి నెలతో దాదాపుగా విద్యార్థుల పరీక్షలు పూర్తయి, ఏప్రిల్ నెల నుంచి వేసవి సెలవులు ఇస్తారు. ఈ మధ్యకాలంలో  వచ్చే ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే ను కూడా  సినిమాల విడుదలకు వాడేసుకుంటున్నారు. ఈసారి ఫూల్స్ డే స్సెషల్ సినిమాల సందడి ఏమిటో ఓసారి చూద్దాం.

వేసవి సెలవుల్లో సినీస్టార్లు, యంగ్ హీరోలు తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ ఫస్ట్ నాడు ఆరు తెలుగు సినిమాలు, మూడు తమిళ్ డబ్బింగ్ సినిమాలు, రెండు హిందీ, రెండు ఇంగ్లీష్ సినిమాలతో అభిమానులను అమితంగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ నటించిన 'సావిత్రి', మంచు మనోజ్ 'అటాక్', '7టు4',  ఆర్తీ ఆగర్వాల్ చివరి సినిమా 'ఆమె ఎవరు?', 'పిడుగు', 'రహదారి' మొదలైన ఆరు తెలుగు సినిమాలు, శర్వానంద్ నటించిన రాజాధిరాజ, నాగార్జున హిట్ టైటిల్ తో ధనుష్ హీరోగా 'మాస్', నన్ను వదిలి నీవు పోలేవు వంటి తమిళ డబ్బింగ్ సినిమాలు,  కీ అండ్ కా,  మా పాస్ హిందీ చిత్రాలు, కుంగ్ ఫూ పాండా 3, ది డైవర్జెంట్ సిరీస్ లోని అలెజియంట్ ఇంగ్లీష్ సినిమాలు ఫూల్స్ డే కి రిలీజ్ కాబోతున్నాయి.

క్లాస్ టచ్ ఉన్న టైటిల్ సావిత్రి తోపాటు ఆకట్టుకునే పోస్టర్లు, ఆనందింపజేస్తున్న ట్రైలర్ తో  దర్శకుడు పవన్ సాదినేని సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా... రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వస్తున్న అటాక్ కూడ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఆర్తీ అగర్వాల్ చివరి సినిమా మార్కుతో వస్తున ఆమె ఎవరు?, తమిళంలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ధనుష్ సినిమా  మాస్ (మారి), మాస్ ప్రేక్షకులను, పెద్దలను కూడ ఆకట్టుకునే నన్ను వదిలి నీవు పోలేవులే సినిమాలు ఏప్రిల్ ఫస్ట్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

గత కొంతకాలంగా యంగ్ హీరోల సినిమాలు హిట్ కొట్టి, మంచి లాభాలు తెచ్చిపెడుతున్న నేపథ్యంలో శర్వానంద్ రాజాధిరాజా తమిళ్ వర్షన్ ను డైరెక్ట్ డీవీడీలుగా థియేటర్లలో ప్రత్యేకంగా రిలీజ్ చేసేందుకు తెలుగు పంపిణీదారులు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇకపోతే మరిన్ని తెలుగు సినిమాలు ఇదే వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతుండగా ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన నాగార్జున 'ఊపిరి'కి వీటిలో ఏదైనా పోటీ పడతాయా లేవా అన్నది మాత్రం అభిమానులు నిర్ణయించాల్సిందే.