హైవే పెట్రోలింగ్‌పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్‌!  | Sakshi
Sakshi News home page

హైవే పెట్రోలింగ్‌పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్‌! 

Published Sun, Nov 5 2023 5:32 AM

Lack of awareness or increasing accidents on highway patrol - Sakshi

గత శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్‌ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్‌ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్‌ ఫెయిల్‌ అయి సెంట్రల్‌ మీడియన్‌ పక్కన నిలిచిపోయింది.

ఎలక్ట్రికల్‌ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్‌ లైట్లు వెలగలేదు.. డ్రైవర్‌ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్‌ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. 

  • జాతీయ రహదారి హెల్ప్‌లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది.  

ఏంటా హెల్ప్‌లైన్‌ వ్యవస్థ? 
1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్‌లైన్‌ నెంబర్‌. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్‌ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది.  
ఏం సాయం అందుతుందంటే..

  • ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్‌ బూత్‌ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్‌ వాహనం, క్రేన్‌ ఉండే టోయింగ్‌ వెహికిల్‌.  
  • రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్‌ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు.  
  • ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది.  
  • ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్‌ చేస్తారు.  
  • ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్‌ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది.  

హెల్ప్‌లైన్‌ ఎలా పనిచేస్తుంది..:
అవసరమైన వారు 1033 హెల్ప్‌లైన్‌కు (ఉచితం) ఫోన్‌ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్‌ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్‌ ఫోన్‌కు ఓ లింక్‌ అందుతుంది. దానిపై క్లిక్‌ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్‌ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు.  

అవగాహనే లేదు.. 
జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్‌లైన్‌ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్‌ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్‌ చేస్తు న్నారు. 1033కి ఫోన్‌ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్‌ సిబ్బందితోపాటు లోకల్‌ పోలీసు స్టేషన్‌కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.

Advertisement
Advertisement