ఫిట్‌నెస్‌ చాలెంజ్‌.. హృతిక్‌కు చేదు అనుభవం

25 May, 2018 15:17 IST|Sakshi
ముంబై రోడ్డుపై సైక్లింగ్‌ చేస్తూ సెల్ఫీ తీసుకుంటున్న హృతిక్‌ రోషన్‌

కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్‌, హృతిక్‌ రోషన్‌, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు. అయితే రాజ్యవర్థన్‌ సవాల్‌ను పూర్తిచేసిన హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

‘ఇదెంతో గర్వకారణంగా ఉంది! నేను ప్రతిరోజూ ఆఫీస్‌కి ఇలాగే వెళ్తాను. కదలకుండా కార్లో కూర్చొని వెళ్లడం వేస్ట్‌. వాకింగ్‌, సైక్లింగ్‌‌, జాగింగ్‌ చేయడం ద్వారా అసలైన భారతదేశాన్ని చూడవచ్చు. ఫిట్‌గా ఉండండి’  అంటూ సైకిల్‌పై ఆఫీస్‌కు వెళ్తున్న ఫొటోలు, సెల్ఫీ వీడియోను హృతిక్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌ అవడంతో.. హృతిక్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘సైక్లింగ్‌ చేస్తూ సెల్ఫీ వీడియో షూట్‌ చేయడం బాధ్యతారాహిత్యం. సెల్ఫీల వల్లే రోజుకు ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయంటూ’  ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా... ‘ఇది ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనే. ముంబై పోలీసులు ఇప్పుడు మీరేం​ చేయబోతున్నారంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హృతిక్‌ నువ్వు ఇలా బిజీ రోడ్డులో సైక్లింగ్‌ చేసే కంటే ఏదైనా గ్రౌండ్‌లో చేయాల్సిందంటూ’  సలహా కూడా ఇచ్చారు. ‘హెల్మెట్‌ ధరించు.. నువ్వే ఇలా చేస్తే మిగతా వాళ్ల సంగతేంటి? ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేసే ముందు ఒకసారి ఆలోచించు’  అంటూ మరొకరు హితవు పలికారు.

మరిన్ని వార్తలు